‘డయల్ యువర్ ఎస్పీ’కి అనూహ్య స్పందన
నారాయణపేట: జిల్లా ప్రజలకు పోలీస్‌శాఖ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుందని ఎస్పీ డా.వినీత్ తెలిపారు. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 19 మంది స్వయంగా ఎస్పీని ఫోన్‌లో సంప్రదించి తమ సమస్యలను తెలియజేశారు. ప్రధానంగా తమ ప్రాంతాల్లో చోరీల నివారణకు పెట్రోలింగ్ పెంచాలని, భూ వివాదాలు, కుటుంబ తగాదాలు పరిష్కరించాలని, గతంలో జరిగిన చోరీ కేసుల్లో నిందితులను ఇప్పటివరకు పట్టుకోలేదని, దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేయాలని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి.. సంబంధిత పోలీస్ అధికారుల ద్వారా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని.. పోలీస్‌శాఖ ఎల్లప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
జిల్లాలో ఎవరైనా పేకాట, కోడిపందాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిరంతర వాహన తనిఖీలు, సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్‌స్టేషన్లలో పనిచేసే అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు.


