ఊట్కూరును ముంపు గ్రామంగా ప్రకటించాలి
ఊట్కూరు: ముంపు గ్రామంగా ప్రకటించాలని మండలకేంద్ర ప్రజలు శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఊట్కూరు, దంతన్‌పల్లి శివారులో భూములు కోల్పోతున్న రైతుల వివరాలు చదివి వినిపించారు. ఎవరికై నా అభ్యంతరాలుంటే ఫిర్యా దు చేయాలని అధికారులు సూచించారు. ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఇంతవరకు విడుదల చేయలేదని, పెద్ద చెరువు రిజర్వాయర్‌గా మారితే భవిష్యత్‌లో గ్రామానికి ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు గ్రామస్తులు ఆయనకు వివరించారు. అలుగుపారే సమయంలో చిన్న గుంత తీసినా ఊటనీరు వస్తుందని, గ్రామం జలమయంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. రిజర్వాయర్ కట్ట ఎత్తు, పొడవు, విస్తీర్ణం తదితర వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి పూర్తి సమాచారం తీసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తానని గ్రామస్తులకు హాహీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్, తహసీల్దార్ చింత రవి, విండో అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అరవింద్‌కుమార్, నాయకులు భరత్, శివారెడ్డి, రమేష్, మోనప్ప తదితరులు పాల్గొన్నారు.


