రోడ్డు భద్రత నియమాలు పాటించండి
నారాయణపేట: దేశంలో ప్రతి సెకండ్ కు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, భద్రతా నియమాలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాల నుంచి తప్పించుకోగల్గుతామని, తల్లిదండ్రులు డ్రైవింగ్ చేసేటప్పుడు పిల్లలను.. యువకులు డ్రైవింగ్ చేసేటప్పుడు తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోవాలని రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈమేరకు విద్యార్థులచే మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల వల్ల తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను, దేశ జట్టులో ఆడే అవకాశం కోల్పోయానని తన స్వీయ అనుభవాలను పంచుకున్నారు. మన శరీరంలో ప్రతీ అవయవం ముఖ్యమని అందుకే వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం వంటి నియమాలు పాటించాలన్నారు. బైక్ స్పీడో మీటర్లపై అమ్మానాన్న అని ఉండేలా స్టిక్కర్లను అంటించాలని రవాణా అధికారులకు సూచించారు. లక్ష స్టిక్కర్లకు తానే స్వయంగా డబ్బులు ఇస్తానని, వాటిని ప్రింట్ తీయించి ప్రతి బైక్‌కు అంటించాలని ఆదేశించారు. యువకులు బైక్ లపై స్టంట్లు చేయడం మానుకోవాలని, ఎంతో మంది రోడ్డు ప్రమాదాల వల్ల ఆత్ములను కోల్పోయారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేష్, మాజీ మార్కెట్ చైర్మెన్ సరఫ్ నాగరాజు , మాజీ కౌన్సిలర్ బోయ రమేష్, నాయకులు దొడ్డి కార్తీక్ వకీల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


