వ్యవసాయ రంగంలో మార్పులు జరగాలి
నోడల్ అధికారికి రైతుల వినతులు
● నూతన విధానంతో
పంటల సాగు చేయాలి
● కేంద్ర నోడల్ అధికారి రమణ్‌కుమార్
● మరికల్‌లో ఎర్రచందనం,
ఆయిల్‌పాం పంటల పరిశీలన
మరికల్: అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టేందుకు కేంద్రం అమలు చేసిన దన్ ధాన్య కృషి యోజన పథకం ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు వస్తున్నాయని కేంద్ర జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కో ఆపరేషన్, పీఎండీడీకేవై సెంట్రల్ నోడల్ అధికారి రమణ్‌కుమార్ అన్నారు. దేశా వ్యాప్తంగా 100 జిల్లాలను ధన్ ధాన్య కృషి యోజన పథకం కింద ఎంపిక చేయగా, అందులో నారాయణపేట జిల్లా ఉండటంతో ఆదివారం కేంద్ర బృందం మరికల్‌లో వ్యవసాయ పంటలు, తోటలను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా కుర్వ శరణప్ప అనే రైతు పంట మార్పిడి చేసి యాసంగిలో సాగు చేసిన ఆముదం, నారాయణరెడ్డి రైతు 28 ఎకరాల్లో సాగు చేసిన ఎర్రచందనం, శ్రీగంధం, మామిడి, నిమ్మ తోటలను పరిశీలించారు. ప్రస్తుతం పండిస్తున్న పంటల లాభ నష్టాలపై రైతుల నుంచి కేంద్ర అధికారులు అభిప్రాయాలను సేకరించారు. అనంతరం జోనల్ అధికారి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా నారాయణపేట జిల్లాలో 6 ఏళ్లలోపు వ్యవసాయ రంగంలో మార్పులను తీసుకురావడం, రైతుల బలోపేతం కోసం కేంద్రం రూ. 1.11 కోట్లను ప్రతిపాదించిందన్నారు. దీని ద్వారా వ్యవసాయ గిడ్డంగులు, పాడి పరిశ్రమ, హార్టీకల్చర్, రైతు సంఘాల బలోపేతం, వ్యవసాయ పరికరాలు, భూసార పరీక్షలు, తదితర వంటిని చేర్చడంతో వ్యవసాయంలో మార్పులు జరిగే అవకాశం ఉందన్నారు. కాలానుగుణంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చూట్టడంతో రైతుల తలరాత మారుతుందన్నారు. పాత పద్దతితో వ్యవసాయం చేస్తే కుటుంబం గడవడమే కష్టంగా ఉంటుందని, కొత్త పద్ధతితో పంటలను సాగు చేయించి, రైతుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. నూతన విధానాలతో వ్యవసాయం చేస్తే రైతులకు లాభదాయం ఉంటుందన్నారు. ఇందుకు సంబందించి రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలతో పాటు సలహాలు, సూచనలు అధికారులు అందజేస్తారన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందంకు రైతులు సూచించారు.
కేంద్ర నోడల్ అధికారి రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటుచేయగా.. రైతులు తమ సమస్యలను విన్నవించారు. మరికల్‌లో ప్రధానంగా మార్కెట్‌యార్డు లేకపోవడం ఇబ్బందులు పడుతున్నామని, యాసంగి పంటలకు కోయిల్‌సాగర్ నీటిని కాల్వల ద్వారా మళ్లించాలని, పత్తి కొనుగోలులో ప్రాధాన్యత ఇవ్వాలని, ధాన్యం అరబెట్టేందుకు ప్లాట్‌ఫాంలు ఏర్సాటు చేయాలని విన్నవించారు. ఇందుకు స్పందించిన ఆయన సీసీఐ కేంద్ర మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి పత్తి కొనుగోళ్లలో జిల్లా రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో గొర్రెల షెడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని పశు సంవర్ధక శాఖ అధికారికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకరప్రసాద్, శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, వికారాబాద్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, డీఆర్డీవో మెగులప్ప, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, పశుసంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి, నాబార్డు అధికారి షణ్ముఖ చారి, ఎల్డీం విజయ్‌కుమార్, డీపీఓ సుధాకార్‌రెడ్డి పాల్గొన్నారు.


