రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం : మంత్రి వాకిటి శ్
మక్తల్– నారాయణపేట– కొడంగల్ ప్రాజెక్ట్‌ను రూ. 4500 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పోరాటం చేసిన అన్ని పార్టీలకు, భూమి ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. దేశ చరిత్రలో ఏ ప్రాజెక్ట్‌కు ఇంత నష్ట పరిహారం ఇవ్వలేదని, సీఎం మన ప్రాంతం బిడ్డ కాబట్టే భూనిర్వాసితులకు రూ.14 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచి రూ.20 లక్షల నష్ట పరిహారం ఇచ్చారన్నారు. జీవో 333 మిగతా ప్రాంత రైతులకు వరప్రదాయిని అయ్యిందన్నారు. ఈ ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన రైతులు డబ్బులు వృధా చేయకుండా మళ్లీ భూమి కొనుక్కోండని వారికి సలహాఇచ్చారు. ఆంధ్రాలో సర్ ఆర్డర్ కాటన్‌లాగా ఈ ప్రాజెక్టుతో సీఎం రేవంత్‌రెడ్డి పేరు ఈ ప్రాంతంలో నిలిచిపోతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం పోరాటం చేసిన తనకు భూ నిర్వాసితులకు చెక్కులు ఇచ్చే గొప్ప అవకాశం దక్కిందన్నారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వరి వేస్తే సిరి అని నిరూపించామన్నారు. విద్య, ఉద్యోగం, అభివృద్ధి, సంక్షేమంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ రామచంద్రనాయక్, నీటి పారుదల శాఖ సీఈ ఎఎస్‌ఎన్ రెడ్డి, ఎస్‌ఈ హెచ్‌టీ శ్రీధర్, ఈఈ బ్రహ్మానంద రెడ్డి, రాజేష్, మత్స్య సహకార సంఘం శాఖ జిల్లా అధ్యక్షుడు కాంత్ కుమార్, మక్తల్ మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్, సలీం, కోణంగేరి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


