30 పోలీస్ యాక్ట్ అమలు
నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని.. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, బహిరంగ సభలు, ధర్నాలు వంటివి నిర్వహించరాదని ఎస్పీ డా.వినీత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారితీసే సమావేశాలు, జన సమూహం చేయ డం పూర్తిగా నిషేధమని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అనవసరమైన విషయాలతో పాటు మతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను వ్యాప్తిచేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు.
అవాంతరాలు లేకుండా యూరియా సరఫరా
నర్వ: యాసంగి పంటల సాగుకు అవసరమైన యూరియా సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సహకార సంఘం సీఈఓ ప్రసాద్‌రావు అన్నారు. శుక్రవారం నర్వ పీఏసీఎస్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు యూరియా స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాసంగి పంటలకు సరిపడా యూరియాను రైతులకు సకాలంలో అందించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. రైతులకు యూరియా అందుబాటులో ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఈఓ వెంట అసిస్టెంట్ రిజిస్ట్రార్ సయ్యద్ రఫియొద్దీన్, జూనియర్ ఇన్‌స్పెక్టర్ షాకీర్ పాషా, పీఏసీఎస్ సీఈఓ ఉదయ్‌కుమార్, కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ ఉన్నారు.
ఓపీ సేవలు ప్రారంభం
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని పాత ఏరియా ఆస్పత్రి భవనంలో ఏర్పాటుచేసిన అర్బన్ హెల్త్ సెంటర్‌లో శుక్రవారం ఓపీ సేవలను డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి కృషితో అత్యవసర సేవల నిమిత్తం అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వైద్యపరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీహెచ్‌సీ సభ్యులు కోర్వర్ కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కొణంగేరి హన్మంతు , ఆర్టీఏ మెంబర్ పోశల్ రాజేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప పాల్గొన్నారు.
జోనల్ కిక్‌బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం
మహబూబ్‌నగర్ క్రీడలు: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో గత నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన జోనల్ కిక్‌బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి తన్షిత ప్రతిభ కనబరిచినట్లు స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు కె.రవికుమార్ తెలిపారు. ఈ పోటీల్లో తన్షిత–37 కేటగిరిలో పాయింట్ ఫైట్‌లో కాంస్య పతకం సాధించినట్లు వివరించారు. ఈ మేరకు శుక్రవారం తన్షితను డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించి సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాస్టర్ రవికుమార్, సలహాదారులు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రేపు బీచుపల్లిలో
సీతారాముల కల్యాణం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాములోరి కల్యాణ వేడుకను కనులారా తిలకించాలని ఆయన కోరారు.
30 పోలీస్ యాక్ట్ అమలు
30 పోలీస్ యాక్ట్ అమలు


