నీళ్లు, ఆరోగ్యం, ఉద్యోగ కల్పనే లక్ష్యం
నారాయణపేట: నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో జిల్లా ప్రజానీకానికి సాగు, తాగునీరు, మెరుగైన వైద్యం అందించడం.. రవాణా సౌకర్యం పెంచేందుకు రహదారుల విస్తరణ, పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు. 2026, 2027 సంవత్సరాల్లోనే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ రెండేళ్లు పెద్ద టాస్క్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. 2028లో డీలిమిటేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని.. ఇప్పుడు ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు మూడు స్థానాలయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగే సమయంలో ఏ మండలం ఎక్కడ ఉండాలి.. ఏ మండలం ఏ నియోజకవర్గంలోకి వెళ్తుందో తెలియని గందరగోళ పరిస్థితులు వస్తాయన్నారు. 2028 వరకు నియోజకవర్గాల పునర్విభజనకే సమయం సరిపోతుందన్నారు. తమకు ఉన్నది రెండేళ్ల సమయమేనని.. జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ప్రభుత్వం రూ. 4,610 కోట్లతో చేపట్టిన పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తిచేసి.. ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరా రూ. 20లక్షల చొప్పున పరిహారం అందించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. నష్టపరిహారం పెంపునకు డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి చేసిన కృషి మరవలేనిదన్నారు. ఎన్నో దశాబ్ధాలుగా కలగా మారిన వికరాబాద్ – కృష్ణా రైల్వేలైన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా భూ సర్వేకు రూ. 430కోట్లు కేటాయించిందన్నారు. జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులను చేపడుతున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని.. పచ్చకామేర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటూ మంత్రి చురకలంటించారు.
పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా గోప్లాపూర్ వద్ద మినీ జురాల ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌శాఖ మంత్రులు బోసు రాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై చర్చించడం జరిగిందన్నారు. గోప్లాపూర్ వద్ద నీటిని ఎత్తిపోస్తూ భూత్పూర్, అక్కడి నుంచి ఊట్కూర్, జాయమ్మ చెరువు, కానుకుర్తి, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, కొడంగల్ వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. చిట్‌చాట్‌లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సుధాకర్, బండి వేణుగోపాల్, ఆర్టీఓ మెంబర్ పోశల్ రాజేశ్, డా.సాయిబాబా, సలీం, కతలప్ప ఉన్నారు.
గోప్లాపూర్ వద్ద మినీ జూరాల
ప్రాజెక్టు ఏర్పాటు దిశగా చర్యలు
కమీషన్ల కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం లేదు
మీడియాతో చిట్‌చాట్‌లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి


