
‘మత్తు రహిత జిల్లానే లక్ష్యం’
నారాయణపేట క్రైం: మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాక సామాజిక కర్తవ్యంగా గుర్తిస్తూ మత్తు పదార్థాల రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ.. నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్‌అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల సమాజానికి, యువతకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్‌హక్, ఆర్‌ఐ నరసింహ, ఎస్‌ఐ సునీత, ఆర్‌ఎస్‌ఐలు శివశంకర్, కృష్ణ చైతన్య, శ్వేత, శిరీష, డీపీఓ, డీసీఆర్‌బీ, ఎస్‌బీ, ఐటీ కోర్ స్టాఫ్, ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
ఆగస్టు15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లను ఎస్పీ యోగేష్‌గౌతమ్ పరిశీలించారు. రానున్న రెండు రోజులలో భారీ వర్షాలు ఉన్నందున వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులతో కలిసి ఏర్పాట్లను చేయాలని, పరేడ్ మైదానంలో సాయుధ పోలీసుల కవాతు సజావుగా నిర్వహిచాలని అధికారులను ఆదేశించారు. వేడుకలను తిలకించడానికి వచ్చే అతిథులు, విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్, ఆర్‌ఐ నరసింహ, ఆర్‌ఎస్‌ఐలు ఉన్నారు.