
కష్టాల కడలిలో ‘గంగ’మ్మ
మృతి చెందిన హరిబాబు ఫొటో చూపిస్తూ ఆదుకోవాలని దీనంగా అర్ధిస్తున్న ఆయన భార్య గంగ, తల్లి మల్లమ్మ, తండ్రి మిద్దె పెద్ద లక్ష్మయ్యను పైదృశ్యంలో చూడవచ్చు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బండరాయిపాకుల గ్రామానికి చెందిన నిర్వాసిత కుటుంబం. పొలం, నివసిస్తున్న ఇల్లుతో పాటు వారి జ్ఞాపకాలన్నీ ప్రాజెక్ట్‌లో తుడిచిపెట్టుకుపోయాయి. వచ్చిన పరిహారం ఫైనాన్స్ నిర్వాహకులకు ఫలహారంగా మారడం.. డబ్బులు వస్తాయో, రావోననే బెంగతో హరిబాబు కిడ్నీ వ్యాధి బారిన పడి మృతిచెందడంతో ఆ కుటుంబం కకావికలమైంది.
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
సాఫీగా సాగుతున్న జీవితంలో..
మిద్దె మల్లమ్మ, పెద్ద లక్ష్మయ్యకు నలుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్లు కాగా.. మొదటి ముగ్గురు గతంలోనే బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసవెళ్లారు. చిన్నకుమారుడు హరిబాబు కాగా.. పెద్దకొత్తపల్లికి చెందిన గంగతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ప్రస్తుతం పెద్ద కుమార్తె శ్రుతి ఇంటర్, శాన్వి ఏడు, సమీర నాలుగో తరగతి చదువుతున్నారు. హరిబాబు ఆటో, ట్రాక్టర్ నడుపుతూ వీరిని పోషించేవాడు. తల్లిదండ్రులు కూడా వీరితోనే ఉండేవారు. ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తున్న క్రమంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో ఆ కుటుంబం పొలం, ఇల్లును కోల్పోవాల్సి వచ్చింది. వచ్చిన పరిహారంలో హరిబాబు తనకు వచ్చిన వాటాలో నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశతో 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్‌లో పెట్టాడు. ఇదే వారి కుటుంబానికి శాపంగా మారింది.
ఫైనాన్షియర్ల ఉచ్చులో పడి.. అనారోగ్యం పాలై..
ఫైనాన్స్‌లో రూ.5 లక్షలను జమచేయగా.. నిర్వాహకులు తొలుత నెలకు రూ.2 చొప్పున వడ్డీ చెల్లించారు. ఆ తర్వాత ఇవ్వకపోవడంతో హరిబాబు నాగర్‌కర్నూల్‌లోని ఫైనాన్స్ కార్యాలయం, నిర్వాహకుల ఇళ్లకు నిత్యం తిరిగేవాడు. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురై.. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. సుమారు 8 నెలలు హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో పునరావాసం కింద వచ్చిన ప్లాటును అమ్మి వైద్య చికిత్స చేయించారు. ఈ క్రమంలో 11 నెలల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన కుటుంబం దిక్కులేనిదైంది. హరిబాబుకు ఆస్పత్రి ఖర్చులు రూ.10 లక్షలకు పైగా అయ్యాయని.. అయినా బతికించుకోలేకపోయామని.. ప్రస్తుతం అప్పుల కుప్ప అయిందని ఆయన కుటుంబసభ్యులు వాపోతున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి గూడు లేకపోవడంతో ముంపులోని పాత బండరాయిపాకులలో తమ చేను వద్ద కవర్‌తో కప్పిన చిన్న గుడిసెలో ఉంటున్నారు.
ఫైనాన్స్ బోర్డు తిప్పేయడంతో బతుకు కుదేలు
మనోవేదనతో కిడ్నీలు దెబ్బతిని భర్త హరిబాబు మృతి
ఆస్పత్రుల్లో చికిత్సకు రూ.10 లక్షలు దాటిన ఖర్చు
ముగ్గురు ఆడపిల్లలు, ముసలి అత్తామామలతో పోషణ భారం