దంచికొడుతున్న వాన | - | Sakshi
Sakshi News home page

దంచికొడుతున్న వాన

Aug 14 2025 10:20 AM | Updated on Aug 14 2025 10:20 AM

దంచిక

దంచికొడుతున్న వాన

నారాయణపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లా వ్యాప్తంగా వాన దంచికొడుతుంది. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను సీపీఓ యోగానంద్‌ వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా ధన్వాడ మండలంలో 55.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా మరికల్‌ మండలంలో 0.5 మి.మీల వర్షపాతం నమోదైంది. దామరగిద్ద మండలంలోని 15.8 మి.మీ, కృష్ణాలో 6.8 మి.మీ, చిన్నజట్రంలో 39.0 మి.మీ, నారాయణపేటలో 26 మి.మీ, మాగనూర్‌లో 3.5 మి.మీ, మద్దూర్‌లో 13.5 మి.మీ, ఊట్కూర్‌లో 17 మి.మీ, జక్లేర్‌లో 15.5 మి.మీ, బిజ్వార్‌లో 22 మి.మీ, కొత్తపల్లిలో 19.5 మి.మీ, మక్తల్‌లో 7 మి.మీ, మొగల్‌మడ్కాలో 2 మి.మీ, నర్వలో 35.5 మి.మీ, గుండుమాల్‌లో 32.3 మి.మీ, కోటకొండలో 0.5 మి.మీ, కోస్గిలో 7 మి.మీ వర్షపాతం నమోదయింది.

అధికారులు, పోలీసులకు సహకరించండి

మక్తల్‌: మరో రెండు, మూడు రోజులు జిల్లా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఎవరూ బయటకు రావద్దన్నారు. రోడ్లపై వాగులు ఉధృతంగా పారుతున్న సమయంలో వాహనదారులు వాటిని దాటేందుకు ప్రయత్నించి ప్రమాదాల బారిన పడొద్దని కోరారు. చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యలు చేపట్టే అధికారులు, పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు. అనుకోని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

నేరాల నియంత్రణకు కృషి

కోస్గి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు నేరాల నిర్మూ లన కోసం కమ్యూనిటీ కాంటాక్ట్‌ పోగ్రాం చేపట్టామని డీఎస్పీ లింగయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని 14వ వార్డులో 60 మంది పోలీసులతో 250 ఇళ్లల్లో సోదాలతో కార్డెన్‌సెర్చ్‌ చేపట్టి సరైన పత్రాలు లేని 56 వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మహిళలు, చిన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తే జైలుకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ సైదులు, ఎస్‌ఐలు బాల్‌రాజ్‌, విజయ్‌కుమార్‌, రాముడు, నవీద్‌, మహేశ్వరి, గాయత్రి, సిబ్బంది ఉన్నారు.

ఎడ్లబండ్లతో తహసీల్దార్‌ కార్యాలయం ముట్టడి

నారాయణపేట/ఊట్కూర్‌: పేట, మక్తల్‌, కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు సరైన నష్టపరిహారాన్ని అందించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం రైతులు ఎడవెల్లి నుంచి పాదయాత్ర చేపట్టారు. ఊట్కూర్‌, దంతన్‌పల్లి శివారులోని భూ నిర్వాసితులు చెక్‌పోస్టు నుంచి పెద్ద ఎత్తున ఎద్దుల బండ్లతో ర్యాలీ చేపట్టి ఊట్కూర్‌ తహసీల్దార్‌ కార్యాలయాల్ని ముట్టడించారు. అంతకుముందు బీజే పీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా భూ నిర్వాసితులు జిల్లా కేంద్రంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నా ప్ర భుత్వం నిమ్మకునీరేత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. మార్కెట్‌లో భూముల ధరలు రూ. 50 లక్షల నుంచి రూ.కోటి దాకా పలుకుతుంటే ప్రభుత్వం కేవలం రూ.14 లక్షలు అందించి చేతులు దులుపుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఆలేరు నియోజకవర్గంలోని గంధమల్ల రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం రూ.24 లక్షలు ఇస్తున్నా.. ఇక్కడ రైతులకు కేవలం రూ.14 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని వాపోయారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ గోవింద్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, అధ్యక్షుడు మశ్చేందర్‌, ఉపాధ్యక్షులు ధర్మరాజుగౌడ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సతీష్‌యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌, సీపీఐ ఎంఎల్‌ నాయకులు సలీం, ఆంజనేయులు, గోపాల్‌, భగవంతు, బలరాం పాల్గొన్నారు.

దంచికొడుతున్న వాన 
1
1/1

దంచికొడుతున్న వాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement