గన్నీ బ్యాగుల కొరత.. రైతుల కలత
తీలేర్ కొనుగోలు కేంద్రం వద్ద సంచుల కొరత కారణంగా ఆరుబయట ఉంచిన ధాన్యం రాశులు
మరికల్: యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో గన్నీ బ్యాగుల కొరత త్రీవంగా వేధిస్తోంది. దీంతో పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం నింపడం కోసం సంచులు లేక అవస్థలు పడుతున్నారు. మరోపక్క నిత్యం సంచుల కోసం రైతులు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది యాసంగి వరి ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారింది. పలు కేంద్రాల్లో రైతులు గన్నీ బ్యాగుల కొరత ఉండగా మరికొన్ని కేంద్రాల్లో సంచులకు నింపిన ధాన్యం తరలించేందుకు లారీలు రావడం లేదు. వీటికి తోడు రైస్ మిల్లుల వద్ద కూడా కూలీల కొరత ఉండటం వల్ల ధాన్యం అన్‌లోడ్ చేయడం కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లాలో 1.50 లక్షల మేట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గాను 35 లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉండగా ప్రస్తుతానికి 25 లక్షల సంచులను అధికారులు రైతులకు అందజేశారు. ఇదిలాఉండగా, జిల్లాలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాలు, రోడ్ల వెంట ధాన్యం ఆరబోయగా.. ఏ నిమిషంలో వర్షం పడుతుందో, ఎక్కడ ధాన్యం తడిసిపోతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా గన్నీ బ్యాగులు అందించి ఉంటే ఇప్పటికే ధాన్యం విక్రయించేవారమని, ఇకనైనా జిల్లా అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.
కారణం ఇదేనా..
జిల్లాలో ఏర్పాటు చేసిన 102 కొనుగోలు కేంద్రాలకు దశల వారీగా అధికారులు గన్నీ బ్యాగులను అందజేశారు. ఇప్పటి వరకు 25 లక్షల సంచులను రైతులకు చేరవేశారు. అయితే కొందరు రైతులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పంటలను కోత కోయకముందే ముందు జాగ్రత్తగా టోకెన్లు రాయించుకొని సంచులను తీసుకెళ్లారు. దీంతో రోజుల తరబడి ధాన్యం ఆరబెట్టిన రైతులకు మాత్రం సంచులు దొరకడం లేదు. ఆరిన ధాన్యం రాశులను పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్దనే నిల్వ చేసుకున్నారు. ఒక్కో రైతు పది రోజుల నుంచి సంచుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సంచుల కోసం వెళ్లిన ప్రతిసారి ఇప్పుడు, అప్పుడంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలను కోత వేయకముందే సంచులు తీసుకెళ్లడంతో ధాన్యం ఆరబెట్టిన రైతులకు సంచులు కొరత ఏర్పడటానికి కారణమైందని అధికారులు చెబుతున్నారు.
అరకొర బ్యాగులతో ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు
కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోతున్న ధాన్యం రాశులు
సంచులు, లారీల కోసం రైతులఎదురుచూపులు
35 లక్షలకు.. వచ్చినవి 25 లక్షలే..
గన్నీ బ్యాగుల కొరత.. రైతుల కలత


