కొత్త డీఎంహెచ్‌ఓకు.. ఎన్నో సవాళ్లు!
నారాయణపేట: జిల్లా ఆరోగ్యశాఖలో గ్రూపుల మధ్య కోల్డ్‌వార్.. గాడితప్పిన డీఎంహెచ్‌ఓ కార్యాలయ నిర్వహణ.. ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో అధికారులు, సిబ్బంది.. రిక్రూట్‌మెంట్, బదిలీలు, తదితర అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొందరిదే పెత్తనం.. ఇష్టానుసారంగా పీహెచ్‌సీలు.. ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహణ.. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారన్న అపవాదులు.. ఇలా ఎన్నో అంశాలు బుధవారం బాధ్యతలు స్వీకరించిన డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్‌కు స్వాగతం పలుకుతున్నాయి. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కొన్ని నియామకాలపై పలువురు ఫిర్యాదు చేయగా ఈ నెల 21 రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు.. ఇక్కడి డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మిని డీపీహెచ్ అండ్ ఎఫ్‌డబ్ల్యూలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నూతన డీఎంఅండ్‌హెచ్‌ఓగా జయచంద్రమోహన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గాడిలో పెట్టేనా..
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పైరవీకారుల ఆటలే సాగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పలు పోస్టులను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నోటిఫికేషన్, కలెక్టర్ అనుమతులు లేకుండానే నియమకాలు చేపట్టడంతో డీఎంహెచ్‌ఓపై వేటుకు కారణమైందని అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. నూతన డీఎంహెచ్‌ఓ ఎలాంటి పైరవీ లేకుండా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి నేరుగా నియామకం కావడంతో.. పైరవీకారుల ఆటలు సాగవని కొందరు చర్చించుకుంటున్నారు. ఇక బాధ్యతలు చేపట్టిన డీఎంహెచ్‌ఓకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ ఒక ఎత్తయితే.. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని గాడిలో పెట్టడం మరో ఎత్తు అనే చర్చ కొనసాగుతోంది. రిక్రూట్‌మెంట్, ఇంక్రిమెంట్స్, బదిలీలు తదితర అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొందరి మాటే చెల్లుబాటు అవుతుందని సమాచారం. దీనికితోడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి. జిల్లాలో మరో రెండు నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు సైతం ఉద్యోగ నియామకాల్లో సిఫారసులు చేస్తుంటారు.
అప్పుడు ఇన్‌చార్జ్..ఇప్పుడు ఫుల్‌చార్జ్
జిల్లా ఏర్పాటైన తర్వాత డాక్టర్ కె.జయచంద్రమోహన్ 2020 మేలో ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ బాధ్యతలు చేపట్టారు. 2021 జూన్‌లో వనపర్తి జిల్లా ఇన్‌చార్జ్‌గా, ఆ తర్వాత ‘పేట’ జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో వైద్యుడిగా విధులు నిర్వర్తించారు. తిరిగి ఇన్నాళ్లకు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశానుసారం అడ్మినిస్ట్రేషన్‌ను కొనసాగించవచ్చు అని తెలుస్తోంది. ఇదిలాఉండగా, డాక్టర్ జయచంద్రమోహన్ బుధవారం డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. అందరూ సమన్వయంతో బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆయనకు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శైలజ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ సిక్తాపట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లాలో డీఎంహెచ్‌ఓగా పనిచేసిన
వారు..పేరు విధుల్లో చేరింది బదిలీ అయ్యింది
కె.సౌభాగ్యలక్ష్మి 17–02–2019 18–03–2020
ఎన్.శైలజా 19–03–2020 23–05–2020
కె.జయచంద్రమోహన్ 24–05–2020 10–06–2021
ఎన్.శైలజా 11–06–2021 06–07–2021
రాంమోహన్‌రావ్ 07–07–2021 23–08–2023
ఎన్.శైలజా 24–08–2023 10–10–2023
కె.సౌభాగ్యలక్ష్మి 11–10–2023 21–04–2025
కె.జయచంద్రమోహన్ 23.04.2025
బాధ్యతలు స్వీకరించిన జయచంద్రమోహన్
ఇటీవల వైద్యశాఖలో ఇష్టానుసారంగా నియామకాలతో తీవ్ర దుమారం
ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను గాడిన పెట్టేనా..?
కొత్త డీఎంహెచ్‌ఓకు.. ఎన్నో సవాళ్లు!


