‘డయల్ 100’ సేవలు ఎంతో కీలకం
నారాయణపేట: శాంతిభద్రతలు పరిరక్షించడంలో బ్లూ కోట్స్, పెట్రో కార్స్ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో డయల్ 100 సేవల నిర్వహణ పై బ్లూ కోట్స్, పెట్రో కార్స్ పోలీసు సిబందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. డయల్ 100 కాల్స్ వచ్చినప్పుడు ఏమైనా సమస్యలు వస్తున్నాయా, ఎలాంటి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. కాల్ వచ్చినప్పటి నుండి త్వరగా సంఘటన స్థలాలకు చేరుకునేంత వరకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు న్యాయం చేకూరే విధంగా విచారణ చేపట్టాలన్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే అట్టి వ్యక్తులను తనిఖీ చేయాలని తెలిపారు. రాత్రి సమయాలలో పట్టణాల ప్రాంతాలలో గస్తీలు నిర్వహిస్తూ ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ మొబైల్ ద్వారా, టాబ్‌ల ద్వారా, లేదా సెట్ ద్వారా కమ్యూనికేషన్ సమాచారాన్ని సంబంధిత సిబ్బందికి చేరవేసి ప్రజల వద్దకు త్యరగా చేరుకునే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలున్న నేరుగా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈసమావేశంలో డీఎస్పీ ఎన్ లింగయ్య, డయల్ 100 పెట్రో కార్స్, బ్లూ కోర్ట్స్ సిబ్బంది, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.


