ఆళ్లగడ్డ: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాల కోసం గ్రామల్లో రాజకీయ సమీకరణలు మొదలయ్యాయి. టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతలు తమ అనుచరులను బరిలోకి దించేందుకు సమయత్తమయ్యారు. ఇటీవల పూర్తయిన మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను బేరీజు వేసుకుంటూ గ్రామాల్లో పట్టు నిలుపుకునేందుకు ఇరు వర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయి. పోటీలో నిలబడాలనుకునే వారు అన్ని వర్గాలను కలుపుకు పోతున్నారు. ఎంత ఖర్చు పెట్టడానికై నా వెనుకాడబోమని ఇప్పటికే అనేక మంది అందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకుంటున్నారు
మూడు దశల్లో ఎన్నికలు
జిల్లా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటి విడత ఈ నెల 26, రెండో విడత 29, మూడో విడత డిసెంబర్ 2వ తేదీన మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసెందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో 488 గ్రామ పంచాయతీల్లో 4,906 వార్డు ఎన్నికలకు నిర్వహించడానికి ముమ్ముర సన్నాహాలు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్వహించిన రోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. గెలుపొందిన అభ్యర్థులకు అక్కడే డిక్లరేషన్ అందజేయనున్నారు. ఇప్పటికే ఖరారైన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ప్రధానంగా జిల్లాలో ఎస్టీ, ఎస్టీ మహిళలకు 20, ఎస్సీ, ఎస్సీ మహిళలకు 103, బీసీ, బీసీ మహిళలకు 123, అన్ రిజర్వుడు, అన్‌రిజర్వుడు మహిళలకు 242 పంచాయతీలు కేటాయించారు. రాజకీయాలకు అతీతంగా జరగనున్నందున బ్యాలెట్ పేపర్లలో పార్టీల గుర్తులు కనిపించవు. మూడు, నాలుగు పంచాయతీలకు కలిపి ఒక క్లస్టరును చేసి అక్కడ నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు.
పల్లె పోరు సజావుగా సాగేనా?
పంచాయతీ ఎన్నికలైనా ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరుగుతాయా? లేక అధికార టీడీపీ కనుసన్నల్లోనే సాగుతాయా? అన్న సందేహాలు ఉన్నాయి. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు మొదలైనప్పటి నుంచి పోలింగ్ ముగిసేవరకు దౌర్జన్యాలు, బెదిరింపులు, రిగ్గింగులతో, రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను తారుమారు చేశారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లోనూ అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని అలాంటి పరిస్థితులనే పునరావృత్తం చేస్తారేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలు మొదలయ్యే అవకాశం ఉంటుందని భయాందోళన చెందుతున్నారు.
గ్రామ పంచాయతీలు : 488
వార్డుల సంఖ్య : 4,906
పోలింగ్ కేంద్రాలు : 5,085
నామినేసన్ కేంద్రాలు : 169
ఓటర్లు : 10,84,706
ఎన్నికలు నిర్వహించే మండలాల వివరాలు..
తొలివిడత: నంద్యాల, గోస్పాడు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యాలవాడ, రుద్రవరం, దొర్నిపాడు, శిరివెళ్ల, మహానంది.
రెండో విడత: ఆత్మకూరు, బండిఆత్మకూరు, వెలుగోడు, పాణ్యం, గడివేముల, నందికొట్కూరు, జూపాడుబంగ్లా, మిడ్తూరు, పగిడ్యాల, పాములపాడు, కొత్తపల్లె.
మూడో విడత: డోన్, ప్యాపిలి, బనగానపల్లె, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, అవుకు, సంజామల.
13న విడుదల కానున్న
ఎన్నికల నోటిఫికేషన్
జిల్లాలో 488 గ్రామ పంచాయతీలు,
4906 వార్డులు
ఈ నెల 26, 29,
డిసెంబర్ 2న పోలింగ్
పోలింగ్ రోజు సాయంత్రమే
ఫలితాల వెల్లడి


