నంద్యాల(అర్బన్): పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములను మహిళా ఓటర్లు నిర్ణయించనున్నారు. జిల్లాలో గ్రామీణ ఓటర్లు 10,84,794 మంది ఉండగా వీరిలో పురుషులు 5,33,160 మంది, మహిళలు 5,51,419మంది, ఇతరులు 125 మంది ఉన్నారు. పురుషులకంటే మహిళలు 18,259 మంది ఎక్కువగా ఉన్నారు. మొత్తం 28 మండలాల్లో 25 చోట్ల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండలాల్లో మాత్రమే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లా అంతటా పురుషులు, మహిళా ఓటర్ల మధ్య తేడా భారీగా ఉంది. దీంతో మహిళల ఓట్లు రాబట్టుకోవడంపై రాజకీయ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. రిజర్వ్ స్థానాల్లో తాము మద్దతు ఇచ్చే మహిళా అభ్యర్థులను పోటీకి దింపాలని వ్యూహరచన చేస్తున్నారు.


