భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తాం
దక్షిణ శ్రీకాళహస్తికి
● కార్తీక మాసంలో కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి భక్తుల రద్దీ ● ఆది, సోమవారాల్లో మరింత తాకిడి ● ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
పాణ్యం:దక్షిణ శ్రీకాళహస్తిగా పేరొందిన శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వరుడి క్షేత్రానికి కార్తీక శోభ సంతరించుకుంది. ఏటా కార్తీక మాసంలో భక్తులు తాకిడి పెరుగుతుండటంతో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ ఆది, సోమవారాల్లో దాదాపు 15 వేల మంది వరకు భక్తులు స్వామివారికి దర్శించుకోగా.. కార్తీక మాసంలో ఈ సంఖ్య మూడింతలు కానుంది. కనీసం 30 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఒక్క రోజే కనీ సం 500పైగా అభిషేకాలు జరుగుతాయి. క్యూలైన్‌లు సైతం గంట వ్యవధిలోనే నిండి రోడ్లపైకి చేరుతాయి. మూడేళ్ల క్రితం భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకోని దాదాపుగా రూ.1.50 కోట్ల వ్యయంతో ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేశా రు. భక్తుల సౌకర్యార్థం శిథిలమైన గదుల స్థానంలో కొత్తగా షెడ్లు నిర్మించారు. వృద్ధులు, చిన్న పిల్లల తల్లులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయనున్నారు. క్యూలైన్లలో భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించారు. భక్తులు త్వరగా స్వామి వారి దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఏకాంత సేవతో మొదలై అర్చకులు ప్రత్యేక పూజలు పూర్తయిన అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. మహిళలు ఉపవాసాలతో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధనకు ప్రత్యేక స్థలం కేటాయించారు.
ప్రత్యేక పార్కింగ్ స్థలం
కార్తీక మాసం పురస్కరించుకుని చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు సంబంధించి వాహనాల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఆలయానికి వంద మీటర్ల దూరంలో దేవస్థాన అధికారులు ఇందు కోసం స్థలాన్ని శుభ్రం చేయించి బైక్‌లు, కార్లు, ఇతర వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఇక నుంచి వాహనాలను ఆలయ సమీపానికి అనుమతించరు.
అదనంగా అన్నప్రసాదాలు
సాధారణంగా ఆది, సోమవారాల్లో వచ్చే భక్తులకు దేవస్థాన నిత్యన్నదాన సత్రంలో అన్నప్రసాదాలు అందిస్తారు. అయితే కార్తీక మాసం సందర్భంగా అదనంగా అన్న ప్రసాదాలను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచే సాయంత్రం వరకు భక్తులు అన్నప్రసాదాలు అందించనున్నారు.
కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భక్తులు సంతృప్తి చెందేలా వారికి సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించి ప్రణాళిక తయారు చేశాం. వచ్చే మొదటి ఆదివారం సందర్భంగా భక్తులు త్వరగా స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రామకృష్ణ, ఆలయ ఈఓ


