సాతనూరు మజరా గ్రామమైన సాతనూరు కొట్టాల గ్రామంలో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపారు. గ్రామంలో పది రోజులుగా తాగునీటి బోరు మరమ్మతులకు గురైంది. పంచాయతీ కార్యదర్శికి సమస్యను వివరించినా నేడు, రేపు అంటూ వాయిదాలకు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో ఉన్న ఒక్క బోరు పనిచేయక పోవడంతో బిందెలను తీసుకుని పొలాలకు వెళ్లి బోర్లను ఆశ్రయించి తాగునీటి తెచ్చుకుంటూ అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు రాముడు, లక్ష్మీ, రామలింగమ్మ, లలితమ్మ, భాగ్యమ్మ, రాములమ్మ, వీరభద్రమ్మలు ఆరోపించారు. వేసవి కాక ముందే తాగునీటి కష్టాలు వస్తే వేసవిలో ఇంకెన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై న సంబంధింత ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకుని గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. – కోసిగి


