శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో స్వామిఅమ్మవార్ల ఆలయ ప్రాంగణంలో శనగల బసవన్నగా పేరుపొందిన నందీశ్వరునికి, శ్రీశైల క్షేత్రపాలకునిగా ప్రసిద్ధిగాంచిన బయలు వీరభద్రస్వామి వారి కి మంగళవారం సందర్భంగా శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు, అర్చకులు విశేషపూజలను నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రదోషకాల సమయంలో క్షేత్రపాలకుడైన వీరభద్రునికి, నందీశ్వరునికి పంచామృతాలతో అభిషేకాది అర్చనలు నిర్వహించారు. ఆరంభ పూజలలో భాగంగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించారు. అనంతరం ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేందుకు గణపతి పూజ చేశారు. తరువాత నందీశ్వర స్వామికి నూతన వస్త్రసమర్పణ విశేషార్చనలు, నానబెట్టిన శనగలను, క్షేత్రపాలకునికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించి కర్పూర నీరాజనాలు అర్పించారు.
వచ్చే నెలలో భగవద్గీత
కంఠస్థ పఠన పోటీలు
కర్నూలు కల్చరల్: గీతా జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లాలో డిసెంబర్ 12వ తేదీ ఉదయం 10 గంటలకు నంద్యాల పట్టణంలోని శ్రీ శారదా విద్యా పీఠంలో, కర్నూలు జిల్లాలో డిసెంబర్ 14వ తేదీ ఉదయం 10 గంటలకు సీక్యాంప్‌లోనీ టీటీడీ కళ్యాణ మండపంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ బహుమతి రూ.1,116, ద్వితీయ రూ.816, తృతీయ రూ.516 నగదు బహుమతితో పాటు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 9441008677, 9059802265 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయాధికారికి గాయాలు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల – ఆళ్లగడ్డ ఆర్‌అండ్‌బీ రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోవెలకుంట్ల మండల వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి గాయపడ్డారు. 108 అంబులెన్స్ సిబ్బంది అందించిన సమాచారం మేరకు.. ఏఓ విధులు ముగించుకుని స్వగ్రామమైన దొర్నిపాడుకు బైక్‌పై వెళుతుండగా మండలంలోని భీమునిపాడు గ్రామ సమీపంలో ఒక వాహనం లైట్లు వేసు కుని ఎదురుగా కన్పించింది. ఆ వాహనానికి సైడు ఇచ్చే క్రమంలో బైక్‌ను రోడ్డుపక్కకు మళ్లించగా అక్కడ మరొక బైక్ నిలిచి ఉండటాన్ని గమనించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఏఓకు గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.


