వెల్దుర్తి: మండల కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్, మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ ఆవరణలోని జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం, ఎస్‌ఎస్‌ఏ, ఏపీఈడబ్ల్యూఐడీసీ ద్వారా చేపట్టిన అదనపు గదులు, వసతులను పరిశీలించారు. హాస్టల్‌లో విద్యార్థినుల సంఖ్య అధికంగా ఉన్నందున, మంజూరైన అదనపు భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు వెంటనే అద్దె భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గిరిజారెడ్డి ఆయనకు విజ్ఞప్తి చేశారు. అనంతరం గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి, పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. గురుకులానికి సొంత భవనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ నర్సమ్మకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ చీఫ్ ఇంజినీర్ శివకుమార్, డీఈ నాగరాజు, ఏఈ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


