ఆళ్లగడ్డ: మున్సిపల్ ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు పచ్చబ్యాచ్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. నంద్యాల మున్సిపాలిటీలో ఆదివారం ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాల్లో బారులు తీరారు. అయితే టీడీపీకి చెందిన నాయకులు పదుల సంఖ్యలో ఏజెంట్ల ముసుగులో కేంద్రాల్లో పాగా వేసి భయబ్రాంతులకు గురి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. కొందరు ఎన్నికల సిబ్బంది, పోలీసులపై వాదనలకు దిగడం, గట్టిగా కేకలు వేయడం చూసిన ఓటర్లు, సిబ్బంది.. అధికార పార్టీ దర్పం చూపేందుకు అడుగడునా యత్నిస్తున్నారని చర్చించుకోవడం గమనార్హం. ఎంపీ బైరెడ్డి శబరి తన మంది మార్బలంతో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తూ హల్‌చల్ చేశారు. ఏమి లేని చోట కూడా గట్టిగా అరుస్తూ.. అటు ఇటూ తిరగడంతో ఓటర్లు నివ్వెరపోయారు. మున్సిపల్ హైస్కూల్, ఎంపీడీఓ కార్యాలయం, నూనెపల్లె తదితర కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై పచ్చబ్యాచ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొట్టి గొడవలు పెట్టుకునేందుకు ప్రయత్నించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓటర్లు రావడంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిసి పోయాయి. సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లను లోపలికి అనుమతించిన ఎన్నికల అధికారులు 5 గంటలకు మెయిన్ గేట్లకు తాళాలు వేసి లోపల ఉన్న ఓటర్లతో ఓట్లు వేసుకునే అవకాశం కల్పించారు. పీవీ నగర్, సుద్దులపేట, అరుందతి నగర్, రైతునగర్ తదితర ప్రాంతాల్లో రాత్రి సుమారు 9 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నంద్యాల మున్సిపాటీలో మొత్తం ఓట్లు 1,99,238 ఉండగా 1,24,501 ఓట్లు పోల్ కాగా 62.49 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు.
స్వల్ప ఉద్రిక్తత..
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూనెపల్లె పొట్టి శ్రీరాములు పాఠశాల పోలింగ్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తుండగా అధికార టీడీపీకి చెందిన శ్రేణులు వారిని అడ్డుకుని ప్రయత్నం చేయడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తిరగబడటంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
జిల్లాలో ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాలిటీలు ఏకగ్రీవం కావడంతో నంద్యాల, నందికొట్కూరు, డోన్ పురపాలక సంఘాలతో పాటు బేతంచెర్ల నగరపంచాయతీలకు చైర్‌పర్సన్‌లతో పాటు మొత్తం 151 వార్డు కౌన్సిల్ స్థానాలకు ఎన్నికల జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 401 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. యువత, మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు.
పోలింగ్ శాతం ఇలా..
నంద్యాల 62.49
డోన్ 67.54
నందికొట్కూరు 80.35
ఆత్మకూరు 73.23
బేతంచర్ల 78.54
జిల్లా మొత్తం 67.06
నంద్యాలలో ఉద్రిక్తతల నడుమ
ముగిసిన పోలింగ్
పోలింగ్ కేంద్రాల్లో
టీడీపీ నేతల మకాం
ఎన్నికల సిబ్బందిపై
దురుసుగా ప్రవర్తన
వైఎస్సార్‌సీపీ నేతలను
రెచ్చగొట్టే ప్రయత్నం
హల్‌చల్ చేసిన ఎంపీ శబరి


