ప్రతిపక్ష నాయకులపై ఆంక్షలెందుకు? | - | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష నాయకులపై ఆంక్షలెందుకు?

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

● టీడీపీ నాయకుల ఆగడాలు

పోలీసులకు కనిపించవా?

● మాజీ ఎమ్మెల్యే

శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి

నంద్యాల(అర్బన్‌): ‘మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు యథేచ్చగా తిరుగుతూ రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తుండటం పోలీసులకు కనిపించడం లేదా.. ప్రతి పక్ష నాయకుల విషయంలో ఆంక్షలెందుకు విధిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి ప్రశ్నించారు. కూటమి నాయకులకు ఒక న్యాయం, ప్రతిపక్ష నాయకులకు మరో న్యాయమా అంటూ నిలదీశారు. పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు కేంద్రాల వద్దకు వెళ్తున్న శిల్పా రవి ఆదివారం మధ్యాహ్నం పోలీసులు అడ్డుకున్నారు. గతంలో శిల్పా రవిపై కేసు ఉందంటూ షోకాజ్‌ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ‘ఏ కేసైనా పెట్టుకోండి నేను ఒంటరిగా వెళ్లి తీరుతాను.. ఎన్నికల నిబంధనల మేరకే పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్తాను. సమయం లేదు. నన్ను వెళ్లనీయ్యండి’ అంటూ పోలీసులకు వివరించారు. అయితే పోలీసులు మాత్రం బయటకు వెళ్తున్న శిల్పా రవిని వెంబడించి తిరిగి ఇంటికి తీసుకొచ్చి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అంతకు ముందు శిల్పారవి మాట్లాడుతూ.. 2024లో నమోదైన కేసు పరంగా హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నామంటూ.. పోలీసులు నోటీసు ఇవ్వడంపై విడ్డూరంగా ఉందన్నారు. తాను ఎన్నికల్లో ఇబ్బంది పెట్టిన సందర్భం, బెదిరించిన సంఘటన కాని లేదన్నారు. టీడీపీ నాయకులు అనుచరులతో కలిసి బైక్‌లతో హల్‌చల్‌ చేయడం, నందికొట్కూరు నుంచి వచ్చిన ఎంపీ శబరి 5 వాహనాలతో పోలింగ్‌ కేంద్రాలు తిరగడం పోలీసులకు కనిపించ లేదా అని ప్రశ్నించారు. 2024లో నమోదు అయిన కేసులో మంత్రి ఫరూక్‌ కూడా ఉన్నారని, ఆయనను కూడా అరెస్ట్‌ చేస్తారా అని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్‌ కేంద్రాల వద్ద యథేచ్ఛగా తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు తాను ఒక్కడినే కారులో వెళ్తున్నా హౌస్‌ అరెస్ట్‌ అంటూ అడ్డగించడం ఎంత వరకు సబబో పోలీసులే సమాధానం చెప్పాలన్నారు. తమ వార్డు మెంబర్ల అభ్యర్థులను అక్రమంగా అరెస్ట్‌ చేసి స్టేషన్లలో ఉంచినా తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాటం సాగించామని శిల్పా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement