● డోన్, బేతంచెర్లలో ఏకపక్ష రిగ్గింగ్‌పై
మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం
● పోలీస్ స్టేషన్ ఎదుట
రెండున్నర గంటలపాటు ధర్నా
డోన్: నంద్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీ, బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో పోలీసు యంత్రాగం హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. పోలింగ్ బూత్‌లను ఆక్రమించి టీడీపీ నాయకులు యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తుంటే పోలీసులు గుడ్లప్పగించి చూశారే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోయారన్నారు. డోన్, బేతంచెర్లలో పోలీసులే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం డోన్‌లోని తన ఇంటినుంచి పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి బోయ చైతన్య, వార్డు కౌన్సిల్ అభ్యర్థులతో పాటు వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్టేషన్ ముందు బైఠాయించి పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆందోళన విరమించాలని కోరినా బుగ్గన వెనక్కి తగ్గలేదు. రెండున్నర గంటలపాటు నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఈ ఎన్నికపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పి ఆందోళనను విరమించారు.
అన్ని వర్గాలను వంచించి..
తాము వాల్మీకులకు చైర్‌పర్సన్ అభ్యర్థిత్వంతోపా టు 9 మందికి కౌన్సిల్ స్థానాలు కేటాయించామని, కాపులు, బలిజలకు 4, ముస్లిం మైనార్టీలకు 4 వార్డులతోపాటు అనేక కులాల వారికి సమానంగా సీట్లు కేటాయించామని బుగ్గన చెప్పారు. చైర్‌పర్సన్ పద వి ఆశించిన ఆర్యవైశ్య, ఈడిగ, బలిజ కులస్తులకు కోట్ల కుటుంబం మొండిచేయి చూపిందన్నారు. ఎంపీపీ పదవి ఇస్తామని యాదవ, వాల్మీకి కులస్తులను చివరి వరకు మభ్యపెట్టి నిట్టనిలువునా ముంచారన్నారు. ఒక బీసీ మహిళ చేతిలో ఘోర ఓటమి చెందుతారనే భయంతో ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడటం చూస్తే ఆ కుటుంబ స్థాయి ఎంతగా దిగజారిందో ప్రజలందరికీ అర్థమైందన్నారు. ప్రజాసేవ చేసేందుకు పోటీ చేస్తున్నానని సుజాతమ్మ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. మూడేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా ఆమె భర్త ప్రకాశ్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నయాపైసా నిధులైనా మంజూరు చేయించారా అని ప్రశ్నించారు.
సామాన్యుల్ని ఓటేయనివ్వలేదు
ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సామాన్యులు ఓటుహక్కు వినియోగించుకోకుండా పోలింగ్ బూత్‌లను ఆక్రమించారని, వేలాది మంది బయటి వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. మహిళల ఓట్లు కూడా టీడీపీ కార్యకర్తలే బూత్‌ల్లో చొరబడి వేయడం దారుణమన్నారు. 29, 30, 31, 32వ వార్డుల పోలింగ్ బూత్‌ల్లో ఉదయం 9 గంటలకే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లేకుండా చేశారంటే ప్రజాస్వామ్యానికి ఏం దుర్గతి పట్టిందో అర్థమవుతోందన్నారు. పట్టణంలోని 1 నుంచి 36 బూత్‌ల్లో ఒకేసారి వేలాది మంది బయటి వ్యక్తులు చొరబడి దొంగ ఓట్లు వేస్తుంటే అభ్యంతరం చెప్పిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా పోలీసులే బయటకు నెట్టేయడం దారుణమన్నారు. మహిళా అభ్యర్థులనే కనికరం కూడా లేకుండా పోలీసులే వారిని చితకబాది పోలింగ్ బూత్‌ల నుంచి బలవంతంగా సేష్టన్లకు తరలించి పచ్చమూకల రిగ్గింగ్‌కు సహాయపడ్డారని ఆరోపించారు.


