శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి పివిఎస్.నాయుడు సోమవారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న కారణంగా డిసెంబర్ 3వ తేదీ వరకు పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేశామన్నారు. నంద్యాల, పల్నాడు, మార్కాపురం జిల్లాలకు చెందిన చెంచు గిరిజనులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
అవినీతి నిరోధక పోస్టర్ల ఆవిష్కరణ
నంద్యాల(న్యూటౌన్): అవినీతి నిరోధక 1064 పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆవిష్కరించారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఈనెల 26 నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టర్ల ప్రదర్శన, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. అక్టోబర్ 30న టోల్‌ఫ్రీ నంబర్ 1064పై ఎఫ్‌ఎం రేడియో ద్వారా ప్రచారం చేపట్టి, అక్టోబర్ 31న మండల కేంద్రాల్లో ప్రజలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ రామాంజనేయులు, ఎస్‌ఐ సుబ్బరాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.
రూ.15.60 లక్షలు స్వాధీనం
నందికొట్కూరు: పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలో శ్రీనివాసులు గౌడ్ ఇంటిలో రూ.15.60 లక్షల నగదును సోమవారం సీజ్ చేసినట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు. నగదు ఇంట్లో ఉంచుకోవడానికి సరైన కారణం చూపించలేదని చెప్పారు. పట్టుబడిన నగదును ఇన్‌కం టాక్స్ డిపార్టుమెంట్‌కు అప్పగించామన్నారు. ఎన్నికల కోడ్ ఉండటంతో ప్రజలు ఇంట్లో రూ. 50 వేలు పెట్టుకోవాలంటే కూడా సరైనా కారణం తెలియజేయాలన్నారు.
నేడు నామినేషన్ల ఉపసంహరణ
నంద్యాల(అర్బన్): జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించనున్నారు. జిల్లాలో 377 ఎంపీటీసీలు, 28 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. బీఫామ్ లేని అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తులతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సి ఉంటుంది.
శ్రీశైలంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులపై ఈఓ శ్రీనివాసరావు కొరడా ఝళిపించారు. ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఇన్‌చార్జ్)చంద్రశేఖరశాస్త్రి, సహాయ ఇంజినీర్ జయపాల్‌నాయక్, వర్క్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌లను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో టెండర్ నోటీసును ఇవ్వడం, టెండర్ ప్రక్రియలో అలసత్వం వహించినందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిడ్నాప్!
చిప్పగిరి: ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం చేసుకోవడానికి టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని, లేదంటే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. మాట వినకపోతే కిడ్నాప్ చేస్తున్నారు. చిప్పగిరి మండలం నంచర్ల గ్రామంలో ఇలాగే జరిగింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా గ్రామానికి చెందిన కురువ లక్ష్మి దేవి, వంచేటి దుర్గమ్మ నామినేషన్లు వేశారు. వారి భర్తలు కురువ రామాంజినేయులు, వంచేటి శివను టీడీపీ నేతలు సోమవారం బెదిరించారు. నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవాలని హెచ్చరించినా బెదరలేదు. అయితే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వంచేటి దుర్గమ్మ ఇల్లు సోమవారం సాయంత్రం తాళం వేసి కనిపించింది. టీడీపీ నేతలే తమ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.


