నంద్యాల(అర్బన్): చేపలు పట్టేందుకు గోరుకల్లు గేట్లు ఎత్తిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల అక్రమార్జన కోసం గేట్లు ఎత్తి నీటిని వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాడినా పట్టించుకోరా అన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ గేట్లు ఎత్తిన సంఘటనలో నష్టపోయిన గోరుకల్లు గ్రామ రైతులు, ప్రజలతో కలిసి సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఇన్‌చార్జ్ కలెక్టర్ సూరజ్‌ధనుంజయ్, ఎస్పీ సునీల్‌షోరాణ్‌కు కాటసాని వినతి పత్రాలు ఇచ్చా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజ ర్వాయర్‌కు సంబంధించి ఆరుగురు రెగ్యులర్ లస్కర్లు ఉన్నా ఓ ప్రైవేటు వ్యక్తికి గేట్ల బాధ్యతలు అప్పగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. జలాశయానికి, ప్రజలు, రైతులకు నష్టం కలిగేలా వ్యవహరించిన వారిని గుర్తించడంలో ఉన్నతాధికారులు ఆలస్యం చేయడం ఏమిటన్నారు. ఈనెల 22వ తేదీన ఘటన జరిగితే పోలీసు, ఇరిగేషన్ అధికారులు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. జలదోపిడీకి పాల్పడుతున్న వారిని అధికారులు గుర్తించలేకపోవడం వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తే దాని నిర్వహణ కోసం దాదాపుగా 20 మంది అధికారులు ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటన జరిగిందంటే అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఇంత జరిగి నా రెండు శాఖల అధికారులు ఎలాంటి చర్యలు ఉపక్రమించకపోవడంపై అనుమానాలు తావిస్తోందన్నారు. నీటి ఉద్ధృతితో నష్టపోయిన పంటలను రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి బాధిత రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలోని సర్వేనం.42లో ఉన్న 17.65 ఎకరాల కుంట ప్రజలకు ఉపయోగ పడుతుందని, ఆ కుంట భూమికి సంబంధించి స్థానిక తహసీల్దార్ నోటీసు జారీ చేయడం వల్ల గ్రామస్తుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ విషయాన్ని ఇన్‌చార్జ్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను గుర్తించాలన్నారు. గ్రామ ప్రజల ప్రయోజనాలు, భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కుంట భూమిని ఇంకుడు చెరువుగా కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. కాటసాని వెంట ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, వైఎస్సార్‌సీపీ నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, నాయకులు సుమంత్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గోరుకల్లు, ఎస్.కొత్తూరు గ్రామ ప్రజలు ఉన్నారు.
అధికార పార్టీ నాయకుల
అక్రమార్జన కోసమే దుశ్చర్య
రిజర్వాయర్ గేట్లు ప్రైవేటు వ్యక్తుల
చేతుల్లో ఉండటం దారుణం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి


