● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
నందికొట్కూరు: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక సీఎం చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే కూటమి నేతలు అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమన్నారు. రైతులు కరువు కాటకాలతో అల్లాడుతుంటే పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు దేశం ప్రభుత్వం మోసం చేసిన తీరును ప్రజలకు వివరించాలన్నారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సచివాలయాల ఉద్యోగులు ఆందోళన చేపడితే లాఠీలతో కొట్టించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఎక్కడ చేశారో ప్రజలకు చూపెట్టాలన్నారు. కరువొస్తే రైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని గుర్తు చేశా రు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్, మిడుతూరు మండల కన్వీనర్ లోకేష్‌రెడ్డి, నాయకులు నాయబ్, జగన్ రఫి, లడ్డు, మార్కెట్ రాజు, వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు జనార్ధన్‌గౌడ్, నాగార్జున, ఓంకారీశ్వర రెడ్డి, ఏసన్న, తదితరులు పాల్గొన్నారు.


