● కర్నూలు జిల్లాలో 1.82,
నంద్యాల జిల్లాలో 1.36 రేటు
● రాష్ట్ర సగటు కంటే కాస్త మేలు
● జీవనశైలిలో మార్పులే కారణం
● వేధిస్తున్న స్థూలకాయం,
హార్మోన్ సమస్యలు
● సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ
ప్రదక్షిణలు
గతంతో పోలిస్తే ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోంది. ఇందుకు మనుషుల్లో వచ్చిన జీవనశైలిలో మార్పులే కారణం. మగవారిలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటోంది. సీ్త్రలలో ఇన్‌ఫెక్షన్లు, పీసీఓఎస్, ఊబకాయం కనిపిస్తున్నాయి. తీవ్ర మానసిక ఒత్తిడితో కూడిన జీవనంతో సంతానలేమి సమస్యలు వస్తున్నాయి. దీనికితోడు సామాజిక, ఆర్థిక, కుటుంబ పరిస్థితులు సైతం జంటలు ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టడానికి కారణం అవుతున్నాయి. సంతానం కావాలనున్న వారు వైద్యులను కలిసి చికిత్స తీసుకుంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. –డాక్టర్ ఎంఎస్. మల్లేశ్వరి,
గైనకాలజిస్ట్, కర్నూలు
జనాభాలో సంతానోత్పత్తి రేటు 2.1 ఉండాలి. కానీ మన జిల్లాలో 1.8లోపు ఉంది. అక్షరాస్యత పెరగడం, కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, చిన్న కుటుంబాలు వంటి కారణాలు సంతానోత్పత్తి తగ్గడానికి కారణం అవుతున్నాయి. మరోవైపు ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, ఆలస్యంగా పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకోవడం, జీవనశైలిలో మార్పులతో సంతానలేమి సమస్యలూ వస్తున్నాయి. ఫెర్టిలిటీ కేంద్రాలు కూడా పెరుగుతున్నాయి. వీటిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
– వై. కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్‌ఓ, కర్నూలు
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పుట్టబోయే పిల్లల సంఖ్య బాగా తగ్గిపోతోంది. భార్యాభర్తలు ఒకరు లేదా ఇద్దరికే పరిమితం అవుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, చిన్న కుటుంబాలు పెరిగిపోవడంతో పిల్లలను పెంచడం భారంగా మారింది. దీంతో పాటు బిడ్డ కడుపులో పడినప్పుటి నుంచి వారు పెద్దయ్యే వరకు ఖర్చు లక్షల రూపాయల్లో ఉంటోంది. పూర్వపు రోజుల్లో ఇలాంటి ఖర్చులేమీ ఉండేది కాదు. ఆడుతూ పాడుతూ...పెద్దయ్యాక ఏదో ఒక పనిచేసుకుంటూ ఉండటంతో అధిక సంతానం ఎవ్వరికీ భారమయ్యేది కాదు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంతానలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువైంది. సంతానం కలగడం లేదని పూర్వపు రోజుల్లో వందలో ఒకరో ఇద్దరో డాక్టర్ వద్దకు వెళ్లేవారు. ఇప్పుడు వందలో 15 నుంచి 20 శాతం మంది తమకు పిల్లలు కలగడం లేదని వైద్యులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 రేటులోపే ఉండగా కర్నూలు జిల్లా కాస్త మెరుగ్గా 1.86గా, నంద్యాల జిల్లా 1.36గా నమోదైంది. అక్షరాస్యత తక్కువగా ఉండే ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆస్పరి, కౌతాళం తదితరప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు 3 నుంచి 3.5 ఉంటోంది. పట్టణ ప్రాంతాలైన కర్నూలు, నంద్యాలలో మాత్రం 1.5 నుంచి 1.8రేటు మధ్యలో నమోదవుతూ వస్తోంది.
పెరిగిన సంతాన సాఫల్య కేంద్రాలు
మనిషికి ఒకప్పటిలా ప్రస్తుతం శారీరక శ్రమ లేదు. యాంత్రీకరణతో శారీరక శ్రమ తగ్గిపోయింది. ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా యువతలో ఊబకాయం, థైరాయిడ్, పీసీఓడీ, పురుషుల్లో వీర్యకణాల సమస్యలు పెరుగుతున్నాయి. పిల్లలు కలగని దంపతులు ఒకప్పుడు సమీప గైనకాలజిస్టులను కలిసి చికిత్స తీసుకునేవారు. అప్పటికీ పిల్లలు కలగకపోతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి సంతాన సాఫల్య కేంద్రాలలోని వైద్యులను సంప్రదించేవారు. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి పట్టణ కేంద్రాల్లోనూ సంతాన సాఫల్య కేంద్రాలు పదుల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. కర్నూలు జిల్లాలోనే వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్టర్ అయిన సంతాన సాఫల్య కేంద్రాలు 20 దాకా ఉన్నాయి. ఆయా కేంద్రాలు, వైద్యుల వద్దకు రోజూ 120 నుంచి 150 మంది దాకా కొత్త దంపతులు చికిత్స కోసం వెళ్తున్నారు.
తగ్గిన శిశు మరణాల రేటు
ఆరోగ్య సదుపాయాలు మెరుగుపడటం, వంద శాతం ఆసుపత్రి ప్రసవాలు జరగడం, సకాలంలో పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించడం వంటి కారణాలతో శిశుమరణాల రేటు గతంతో పోలిస్తే ప్రస్తుతం బాగా తగ్గింది. గతంలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనారోగ్యంతో కొందరు మరణించినా, మరికొందరు మిగులుతారనే భావన ఉండేది. ఇప్పుడు శిశు సంరక్షణ పెరగడంతో ఒక్కరు లేదా ఇద్దరు చాలు అనే భరోసా ప్రజల్లో వచ్చేసింది.


