శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు దీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనా మస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు క్యూకంపార్ట్‌మెంట్లలో పాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ
● జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్
నంద్యాల(న్యూటౌన్): స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 21వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులు స్వీకరించారు.
శ్రీశైల దేవస్థాన డీఈ, ఏఈకి షోకాజ్ నోటీసులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్(ఇన్‌చార్జి) చంద్రశేఖరశాస్త్రి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ఏఈఈ) భవన్‌కుమార్‌కు దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. సుమారు రూ.1.50 కోట్లతో నిర్మించిన శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి క్వార్టర్ నిర్మాణ పనులను ఒక కాంట్రాక్టర్ టెండర్ ద్వారా పొంది, సబ్ కాంట్రాక్ట్‌కు పనులు అప్పగించి చేసినట్లు విచారణలో వెల్లడైందని, ఈ విషయమై విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డీఈఈ, ఏఈఈలకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయమై వారం రోజుల్లో లిఖిత పూర్వక వివివరణ ఇవ్వాలని వారికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
పెన్షనర్ల ఉద్యమ శంఖారావం
● ఈ నెల 29, 30 తేదీల్లో
నిరాహార దీక్షలు
కర్నూలు(సెంట్రల్): తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు శంఖారావం పూరించారు. ఈ నెల 29, 30 తేదీల్లో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆ సంఘం కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షుడు కోట్ల లింగం తెలిపారు. కర్నూలులోని గౌరీగోపాల్ హాస్పిటల్‌కు ఎదురుగా ఉన్న ధర్నా చౌక్‌లో 24 గంటల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పెన్షన్ రూల్స్ వ్యాలిడేషన్ చట్టం– 2025ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 8వ వేతన సంఘం పరిధిలో పెన్షన్ సవరణను చేర్చాలని, మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని కోరారు. సమాన హోదాకు సమాన పెన్షన్ అమలు చేయాలని, ఫ్యా మిలీ పెన్షన్ను మెరుగుపరచాలని కోరుతున్నట్లు చెప్పారు. ఆయా డిమాండ్ల సాధన కోసం చేపట్టే నిరాహార దీక్షలకు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజ రై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం
ఎమ్మిగనూరురూరల్: ఇంట్లో ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థి ఆరేకంటి ప్రవళ్లిక(19) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఏనుగుబాల గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని ఎమ్మిగనూరులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తండ్రి బజారి కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం చర్చికి వెళ్లి వచ్చాక తల్లి, కుమార్తె భోజనం చేశారు. తల్లి పొలంలో పత్తి పనికి వెళ్లగా ప్రవళ్లిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియటం లేదు. విచారణ జరుపుతున్నట్లు రూరల్ ఎ్‌స్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.


