శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను కర్ణాటక రాష్ట్రం ఉడిపి క్షేత్రంలోని ద్వైత సంప్రదాయ అష్టపీఠాలలో ఒకటైన పలిమారు మఠం ప్రధాన పీఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామి, ఉత్తరాధికారి విద్యారాజేశ్వరతీర్థ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆదివారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పీఠాధిపతులకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, అధికారులు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతులు మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు పీఠాధిపతికి, ఉత్తరాధికారికి దేవస్థానం తరుపున వస్త్రసమర్పణ చేశారు. పీఠాధిపతులు ఇద్దరు అందరికి ఆశీర్వచనాలు అందించారు.


