పాడిపశువులతో రైతుల బంధం అంతా ఇంతా కాదు. కుటుంబ సభ్యులతో సమానంగా వాటిని చూసుకుంటారు. వ్యవసాయంలో తోడుగా నిలిచే ఎద్దులను మరింత ఆత్మీయంగా చూస్తారు. వాటి పోషణే కాదు బాగోగుల విషయంలో శ్రద్ధ చూపుతారు. అవి అనారోగ్యానికి గురైతే ఇంట్లో మనుషులు జబ్బుపడినంతగా ఆందోళన చెందుతారు. అలాంటిది.. కళ్లెదుటే కాడెద్దు కుప్పకూలి మృతి చెందితే ఆ రైతు వేదన చెప్పనలవి కాదు. ఇలాంటి ఘటనే బేతంచెర్ల పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. హనుమాన్ నగర్ కాలనీకి చెందిన తవిసి కొండ నాగ మద్దయ్య తనకున్న రెండెకరాలతో పాటు మరో 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఆదివారం పొలంలో ఎద్దులతో సేద్యం చేస్తుండగా ఒక్కసారిగా ఓ ఎద్దు కుప్ప కూలి మృతిచెందింది. సుమారు రూ. 46 వేల విలువైన ఎద్దు కళ్లెదుటే మృతి చెందడంతో రైతు కన్నీరు పెట్టాడు. ఇప్పటికే వర్షాలు లేక కరువు కోరల్లో చిక్కుకున్న ఆందోళన చెందుతున్న రైతు ఎద్దు మృతితో మరింత కుంగిపోయాడు. – బేతంచెర్ల


