వారం ముడుపులు ఇస్తేనే పనులు | - | Sakshi
Sakshi News home page

వారం ముడుపులు ఇస్తేనే పనులు

Sep 21 2026 6:47 AM | Updated on Sep 21 2026 6:47 AM

దారితప్పిన వీబీ జీ రామ్‌ జీ

బెంగళూరులో ఉద్యోగం.. స్థానికంగా మస్టరు

విద్యార్థులూ ఉపాధి కూలీలే..

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

కర్నూలు(అగ్రికల్చర్‌): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన వీబీ జీ రామ్‌జీ కింద చేపట్టే ఉపాధి పనుల్లో అక్రమాలు ఉండవనే అభిప్రాయం మొదట్లో ఉండింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌తో పోలిస్తే వీబీ జీ రామ్‌జీలో అక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌, ముంబై నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా, ఇతర ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్న అనేక మంది నిత్యం సొంత గ్రామాల్లో ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు మస్టర్‌లు వేస్తున్నారు. ఏనాడు ఉపాధి పనుల వైపు కన్నెత్తి చూడని చిన్నారులు సైతం నిత్యం ఉపాధి పనులకు వస్తున్నట్లు మస్టర్లు వేస్తున్నారు. ముఖ గుర్తింపునకు ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలు ఒక్క మండలమో.. రెండు మండలాల్లో కాదు.. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి బాగోతాలే. అక్రమాల్లో టీడీపీ నేతలతో పాటు ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు, ఏపీవో, ఏపీడీల వరకు వాటాలు ఉంటున్నాయనే చర్చ జరుగుతోంది. ఉపాధిలో జరిగే అక్రమాలపై తుగ్గలికి చెందిన ఓ యువకుడు ఆధారాలతో సహా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై దాడి చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించడానికి అక్రమార్కులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత యువకుడు తనకు ప్రాణహాని ఉందని, తగిన రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని సైతం కోరటం గమనార్హం.

విద్యార్థులు సైతం ఉపాధి కూలీలే..

పాఠశాల్లో చదివే విద్యార్థులు, వివిధ నగరాల్లో పనులు చేసుకుంటున్న వారు సైతం ఉపాధి పనులకు వస్తున్నట్లు మస్టరు వేస్తున్నారు. ముందే మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ మొబైల్‌ ఫోన్లలో పెట్టుకున్న వందలాది వీడియోల నుంచి ఫొటోలు తీసి ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. పది మంది ఉపాధి పనులకు వస్తే 50 మందికి మస్టర్లు వేస్తుండటం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో జరుగుతోంది.

పశువుల షెడ్లు మంజూరుకు,

బిల్లులు చేయడానికి ముడుపులే...

వీబీజీ రామ్‌ జీ నిధులతో పశువుల షెడ్లు నిర్మిస్తున్నారు. 2026–27లో కర్నూలు జిల్లాలో 1,078, నంద్యాల జిల్లాలో 1,094 పశువుల షెడ్లు మంజూరయ్యాయి. టీడీపీ నేతల నుంచి వచ్చిన సిఫార్సులకు ఉపాధి సిబ్బంది ఎస్టిమేట్‌ జనరేట్‌ చేసి జిల్లా డ్వామా కార్యాలయానికి పంపుతారు. ఎస్టిమేట్‌లు వేయడానికే ఉపాధి సిబ్బంది రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ముడుపులు వసూలు చేస్తుండటం గమనార్హం. 2025–26లో మంజూరైన పశువుల షెడ్లకు బిల్లులు అప్‌లోడ్‌ చేయడానికి ఉపాధి సిబ్బంది రూ.25 వేల వరకు డిమాండ్‌ చేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తమకేమి మిగులుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

ఈసీ, ఏపీఓ ఒక్కరే..

మంత్రాలయం నియోజకవర్గంలోని ఓ మండలంలో ఈసీ, ఏపీవో ఒక్కరే. ఈసీనే ఏపీవోగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా రెండు పోస్టుల్లో కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి ఈయన ఈసీ. అయితే తెలుగుదేశం పార్టీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని ఏపీవోగా ఎవ్వరూ రాకుండా చేసుకొని రెండు పోస్టుల్లోనూ కొనసాగుతున్నారు. ఈయన అవినీతి, అక్రమాల బాగోతం జిల్లా నీటియాజమాన్య సంస్థలో చర్చనీయాంశమవుతోంది.

విద్యార్థులు, ఉద్యోగులకు

సొంత గ్రామాల్లో మస్టర్లు

60 శాతం పంచాయతీల్లో

ఊసేలేని ఉపాధి పనులు

తుగ్గలిలో విద్యార్థులకు సైతం

బోగస్‌ మస్టర్లు

ప్రతీ వారం ముడుపులిస్తేనే పనులు

టీడీపీ నేతల అండతో

ఉపాధి సిబ్బంది దందా

తుగ్గలి గ్రామానికి చెందిన పఠాన్‌ హర్షద్‌ ఖాన్‌ బెంగళూరులో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. మహబూబ్‌ సుభాన్‌ అనే వ్యక్తి బెంగళూరులోనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వీరిద్దరూ అక్కడే ఉంటున్నారు. అయితే వీరిద్దరూ ఆగస్టు 8 నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఉపాధి పనులకు హాజరైనట్లు లెక్కలు చూపడం ఆశ్చర్యకరం. ఆ సమయంలో వీరు స్థానికంగా లేకపోవడం గమనార్హం.

తుగ్గలి గ్రామానికి చెందిన ఈడిగ పుష్పశ్రీ 7వ తరగతి, ఈ బాలిక అక్క 10వ తరగతి పత్తికొండలోని సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌లో చదువుతున్నారు. అయితే పుష్పశ్రీకి 21 ఏళ్లు, జయశ్రీకి 22 ఏళ్ల వయస్సుతో 2025 సెప్టెంబర్‌ 30న జాబ్‌ కార్డులో పేర్లు రిజిస్టర్‌ చేశారు. వీరిద్దరూ గత నెల 3 నుంచి 9వ తేదీ వరకు, 20 నుంచి 26వ తేదీ వరకు, 31 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు 21 రోజులు పాధి పనులకు హాజరైనట్లు మస్టర్‌ వేశారు. ఇంటి దగ్గర ఈ బాలికల వీడియోలు తీసుకొని ఫొటో తీసి ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ పని దినాలకు వచ్చిన డబ్బును ఉపాధి సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు. టీడీపీ నేతలకు భాగం ఉండటంతో ఈ బాగోతం సాగిపోతోంది.

గత జూన్‌ 15 నుంచి వర్షాలే లేవు. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో వర్షాధారం కింద సాగు చేసిన పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. వ్యవసాయ పనులు జీరో కావడంతో ఉపాధి కోసం వ్యవసాయ కూలీలు, సన్న, చిన్న, మధ్య కారు రైతులు దిక్కులు చూస్తున్నారు. ఈ సమయంలో ఉపాధి పనులు అత్యవసరం. అయితే ఈ పరిస్థితిని టీడీపీ నేతలు, ఉపాధి అధికారులు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారానికి ఇంత చొప్పున డబ్బులు ఇస్తేనే ఉపాధి పనులు పెట్టుకో, లేదంటే మేం సహకరించేది లేదని తెల్చి చెబుతున్నారు. మేట్‌, సీనియర్‌ మేట్‌ ప్రతి లాగిన్‌కు ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. ఫలితంగా మేట్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు అడ్డగోలుగా బోగస్‌ మస్టర్లు వేసేందుకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో 26,965, నంద్యాల జిల్లాలో 23,455 మంది ఊపాధి పనులకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే 75 శాతం పంచాయతీల్లో పనుల ఊసే లేదు. కౌతాళం మండలంలోని ఒక్క పంచాయతీలో కూడా పనులు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ కారణంగా పశ్చిమప్రాంతం నుంచి వలసలు ఊపందుకున్నాయి. నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గం నుంచి కూడా వలసలు పెద్ద ఎత్తున ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement