‘కుర్చీ’పై వీడని మమకారం | - | Sakshi
Sakshi News home page

‘కుర్చీ’పై వీడని మమకారం

Sep 21 2026 6:47 AM | Updated on Sep 21 2026 6:47 AM

శ్రీశైలంటెంపుల్‌: ఆధ్యాత్మికతకు నిలయమైన దివ్య క్షేత్రం.. నిత్యం ఈశ్వరుని సేవలో తరించే భాగ్యం.. అధికారిగా పార్వతీ పరమేశ్వరులకు సేవ చేసే అవకాశం. మరోవైపు ఉన్నతాధికారి హోదా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం సంప్రదించే సీటు.. తనకు సేవ చేసేందుకు సిద్ధంగా కావాల్సినంత మంది ఉద్యోగులు.. ఉచితంగా ఇంద్రభవనం లాంటి గృహం.. ఇలా ఎన్నో రకాల సౌకర్యాలు దొరుకుతుంటే ఎవరైనా ఆ కుర్చీని వదులుకుంటారా?.. ఆ పదవిలో మరో రెండేళ్లు కొనసాగేందుకు ఓ ఉన్నతాధికారి పైరవీలకు తెరతీశారు. దేవదాయశాఖలో అధికారుల కొరత కారణంగా రాష్ట్రంలోని 6ఏ దేవస్థానాలకు రెవెన్యూ శాఖ నుంచి స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని ఆలయ ఉన్నతాధికారిగా ప్రభుత్వం నియమిస్తోంది. రాష్ట్రంలో అతిపెద్ద దేవస్థానాల్లో తిరుమల తరువాత రెండవది శ్రీశైల దేవస్థానం. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలసిన మహాపుణ్య క్షేత్రం కావడంతో అనునిత్యం వేలాది మంది భక్తులతో శ్రీశైల దేవస్థానం నిత్యకల్యాణం పచ్చతోరణంలా కళకళలాడుతుంటుంది. అంతటి ప్రాధాన్య త ఉన్న దేవస్థానానికి ఉన్నతాధికారిగా రావాలంటే ఎవరైనా ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలోనే శ్రీశైల దేవస్థానానికి కూడా రెవెన్యూ శాఖ నుంచి అధికారులను ఉన్నతాధికారిగా ప్రభుత్వం నియమిస్తుంది. రెవెన్యూ విభాగం నుంచి డిప్యూటేషన్‌పై దేవదాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు ఒక సంవత్సరం కాల పరిమితితో ఈఓలుగా నియమిస్తుంది. ఆ తరువాత మరో ఏడాది కాలపరిమితిని పొడిగిస్తుంది.

కుర్చీపై మమకారంతో పైరవీలు

శ్రీశైల దేవస్థానంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి రెండేళ్ల కాలపరిమితి డిసెంబరు 5వ తేదీతో ముగియనున్నట్లు తెలుస్తుంది. దీంతో మరో రెండేళ్ల పాటు తానే ఉన్నతాధికారిగా కొనసాగేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. దేవస్థాన ఉన్నతాధికారి కుర్చీపై ఉన్న మమకారంతో ఆ కుర్చీ కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. క్యాంపుల పేరుతో రాజధాని ప్రాంతానికి వెళ్లి తనకు పరిచయం ఉన్న రాజకీయ నాయకులతో అదే స్థానంలో కొనసాగేందుకు పైరవీలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కుర్చీ వదలకుండా అదే స్థానంలో కొనసాగేందుకు పెద్ద ఎత్తున ఫైరవీలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది.

విద్యాసంస్థల అధినేతతో సిఫారసు

శ్రీశైల దేవస్థాన ఉన్నతాధికారిగా రెండేళ్ల పాటు విధులు నిర్వహించినప్పటికీ సంతృప్తి చెందని ఆ అధికారి మరో రెండేళ్లు అదే స్థానంలో కొనసాగేందుకు రాజధానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేతతో ప్రభుత్వానికి సిఫారసు చేయించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా గతంలో ప్రస్తుత రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్నతాధికారి విధులు నిర్వహించినప్పుడు ఆ విద్యా సంస్థల అధినేతకు స్వామిభక్తి ప్రదర్శించి వారికి అనుకూలంగా పని చేసినట్లు సమాచారం. అ కృతజ్ఞతగా తనకు ఇప్పుడు అదే స్థానంలో కొనసాగింపునకు సిఫారసు చేయాలని వేడుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీశైల దేవస్థానంలో

ఓ ఉన్నతాధికారి పైరవీలు

రెండు నెలల్లో ముగియనున్న

కాలపరిమితి

మరో రెండేళ్లు కొనసాగేందుకు

ముమ్మర ప్రయత్నాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement