విద్యార్థులు సులభంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా బోధించేందుకు కొందరు ఉపాధ్యాయులు కృషి చేస్తుంటారు. అందులో తుగ్గలి మండలం లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అద్దంకి చంద్రమోహన్ ఒకరు. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఆయన ప్రస్తుతం లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. 2008లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఆయన పలు పాఠశాలల్లో పని చేశారు. టీఎల్‌ఎం (టీచింగ్, లెర్నింగ్, మీటీరియల్) రూపొందించారు. స్వతహాగా చేసిన టీఎల్‌ఎం ద్వారా విద్యార్థులకు బోధిస్తూ ఉత్తమ ఫలితాలు రాబడుతున్నారు. సాంకేతికత సాయం, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వినూత్నంగా పాఠాలు బోధించడం ఆయన ప్రత్యేకత. వంద శాతం ఎన్‌రోల్ మెంట్, నో బ్యాగ్ డే, యోగా, క్విజ్, చిత్ర లేఖనం తదితర వాటిని అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఎక్కువగా గుర్తుండే విధంగా సబ్జెక్టుల్లోని ప్రతి అంశాన్ని ప్రయోగాత్మక పద్ధతిలో బోధించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటూ విద్యార్థుల ఉన్నతికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. జీ.ఎర్రగుడి పాఠశాలలో పనిచేసిన సమయంలో రాష్ట్ర స్వచ్ఛ విద్యాలయ పురస్కారం, 2024లో ఉపాధ్యాయ రత్న, 2025లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం పట్ల చంద్రమోహన్ ఆనందం వ్యక్తం చేశారు. అవార్డుతో మరింత బాధ్యత పెరుగుతుందని, భవిష్యత్‌లో మరింత మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. – తుగ్గలి


