అందరి ఉపాధ్యాయుల్లా ఆమె పాఠశాలకు వెళ్లామా.. పాఠాలు చెప్పామా.. ఇంటికి తిరిగి వచ్చామా అనుకోలేదు. దాదాపు 28 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఆమె చూపిన అంకితభావానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. దేవనకొండ మండలం కరివేముల ఎంపీపీఎస్ స్కూల్ హెచ్‌ఎంగా పనిచేస్తున్న శీలం జయమ్మ సొంతూరు వెలుగోడు మండలం వేగులగూడూరు. 1998 ఆగస్టు 21న హాలహర్వి మండలం హాలహర్వి ఆదిఆంధ్ర పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా విధుల్లో చేరారు. తర్వాత దేవనకొండ మండలం కరివేముల, జూపాడుబంగ్లా మండలం మండ్లెం, నందికొట్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (పేట)లో విధులు నిర్వర్తించారు. గతేడాది జూన్‌లో కరివేముల ఎంపీపీ పాఠశాలకు పీఎస్ హెచ్‌ఎంగా పదోన్నతిపై వచ్చారు. ఆమె ఎక్కడ విధులు నిర్వర్తించినా విద్యార్థుల్లో దాగిన ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీయడం, విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎంపికయ్యేలా ప్రోత్సహించడం, చదువుకు దూరంగా విద్యార్థుల ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడిలో చేర్పించారు. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెబుతూ విద్యలో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దారు. కరివేముల పాఠశాలకు హెచ్‌ఎంగా వచ్చినప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషిచేశారు. అలాగే గ్రామంలో జానకి వావిలాల కృష్ణమూర్తి ట్రస్టు హాస్టల్ కూడా వచ్చింది. ఆమె సేవలను గుర్తించిన అధికారులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు రావడం ఆనందంగా ఉందని, తన సేవలను కొనసాగిస్తానని చెప్పారు. – దేవనకొండ


