విధులు నిర్వహిస్తున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం, అక్కడ చదువుతున్న విద్యార్థుల ఉన్నతికి పాటుపడటంలో బనగానపల్లె పట్టణం కొండపేట ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు సతీష్‌కుమార్ ముందంజలో ఉన్నారు. బనగానపల్లె పట్టణానికి చెందిన ఈయన 2002 అక్టోబరులో బనగానపల్లె మండలంలోని గిరిజన ప్రాంతమైన గులాం అలిబాద్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన బాలికలు చాలా మంది 6వ తరగతి చదివే అవకాశం లేక ఇళ్ల వద్దనే ఉండిపోయారు. ఆ సమస్యను సతీష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి యూపీ పాఠశాల మంజూరైంది. 2009లో వెంకటాపురం ఎంపీయూపీఎస్ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులుగా చేరారు. అక్కడ గణితం, ఇంగ్లిషులో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని గుర్తించి ప్రత్యేక ప్రణాళిక బోధనతో విద్యార్థులను తీర్చిద్దారు. ఎన్‌ఆర్‌ఐలు, గ్రామస్తుల సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. 2017లో టంగుటూరు ఎంపీపీఎస్ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఆయన విధులు నిర్వర్తించే పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పించడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో తనదైన ముద్ర వేస్తున్నారు. తన సేవలను గుర్తించిన ప్రభు త్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. – బనగానపల్లె


