● పొలంలో మృతదేహం లభ్యం ● విచారణ చేస్తున్న పోలీసులు
పత్తికొండ రూరల్: పత్తికొండ మండల పరిధిలోని కోతిరాళ్ల గ్రామ పొలాల్లో గురువారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కోతిరాళ్లకు చెందిన హరిజన శాంతమ్మ (65) ఉదయం పొలం పనులకు వెళ్లి రాత్రయినా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి ఆమె కోసం వెతికారు. శాంతమ్మను గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది చంపిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ వెంకట్రామయ్య, ఇన్‌చార్జ్ సీఐ శ్రీనివాసులునాయక్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆస్తి వివాదం కారణంగా బంధువులే హత్య చేసి ఉంటారనే అనుమానంతో మృతురాలి కుమారుడు హరిజన కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ కోణంలో అనుమానితుల మీద విచారణ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం డీఎస్పీ వెంకట్రామయ్య, ఇన్‌చార్జ్ సీఐ శ్రీనివాసులునాయక్, ఎస్‌ఐ రాందాస్ గ్రామానికి వెళ్లి హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మృతిపై విచారణ చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.


