అంతా శివయ్యే చూసుకోవాలి! | - | Sakshi
Sakshi News home page

అంతా శివయ్యే చూసుకోవాలి!

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్‌ విభాగం అత్యంత కీలకం. ఈ విభాగం ద్వారా క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీగిరిలో త్వరలో సుమారు రూ.800 కోట్లతో మూడు విడతలుగా మాస్టర్‌ ప్లాన్‌ పనులకు శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించాలని ట్రస్ట్‌బోర్డు ఆశిస్తోంది. అయితే దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (ఈఈ) రిటైర్‌ కావడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జ్‌ డీఈఈ హోదాలో ఇద్దరు ఏఈఈలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రంలో ఇంజినీర్ల కొరతతో అభివృద్ధి పనులకు అటంకం కలగనుంది.

దేవస్థానంలో ఇంజినీర్ల కొరత

రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైల మహాక్షేత్రం రెండవది. శ్రీశైల దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగంలో ఈఈలు ఇద్దరు ఉండాలి. అలాగే సివిల్‌–2, ఎలక్ట్రికల్‌–1, వాటర్‌ సఫ్లై–1 ఇలా నలుగురు డిప్యూటీ ఈఈలు ఉండాలి. అలాగే హెడ్‌ డ్రాఫ్ట్‌స్‌మెన్‌–ఒకరు, డ్రాఫ్ట్‌స్‌మెన్‌–ఇద్దరు ఉండాలి. ఒక్కో డీఈఈ కింద ఐదుగురు సహాయ ఇంజినీర్లు ఉండాలి. ఒక్కో ఏఈకి ఒక వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉండాలి. అంతేగాకుండా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్స్‌, ఫిట్టర్‌, పంప్‌ ఆపరేటర్‌, సూపర్‌వైజర్స్‌, మేషన్‌ (మేస్త్రి), కార్పెంటర్‌, వెల్డర్‌, పెయింటర్‌, హెల్పర్స్‌ ఉండాలి. దేవస్థానంలోని ఇద్దరు ఈఈల్లో ఒకరు జూన్‌లో, మరొకరు ఆగస్టులో రిటైర్‌ అయ్యారు. దీంతో రెండు ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నలుగురు డీఈఈలకు గాను ఎవరు లేరు. 20 మంది ఏఈలకు గాను నలుగురు రెగ్యులర్‌, మరికొంత మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్‌స్‌మెన్‌ ఒకరు మాత్రమే ఉన్నారు. అంతేగాకుండా ఇద్దరు ఏఈఈలు, ఇన్‌చార్జ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ (సివిల్‌, ఎలక్ట్రికల్‌) ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

అనుభవం ఉన్న అధికారి అయితే..

సుమారు రూ.800 కోట్లతో మూడు విడతల్లో చేపట్టనున్న మాస్టర్‌ప్లాన్‌ అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే గతంలో దేవస్థానంలో పనిచేసిన అనుభవం కలిగిన అధికారిని ఈఈగా నియమించాలనే వాదన వినిపిస్తోంది. రూ.800కోట్ల అభివృద్ధి పనులు ఎటువంటి అంతరాయం లేకుండా వేగంగా, క్షేత్రంలో మౌలిక వసతులు, దేవస్థాన ఇంజినీరింగ్‌ పనులపై అవగాహన ఉండి గతంలో క్షేత్రంలో పనిచేసిన ఈఈను శ్రీశైలానికి డెప్యూటేషన్‌ లేదా బదిలీపై నియమించాలని కొన్ని నెలల క్రితం ఈఓ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ సైతం రాశారు. అయితే టీడీపీ ముఖ్యనేత అనుచరుడు ఆర్‌అండ్‌బీ శాఖలో ఈఈగా ఉన్న ఓ అధికారిని దేవస్థాన ఈఈగా డెప్యూటేషన్‌పై తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా దేవదాయ శాఖ అధికారులు శ్రీశైల దేవస్థానంలోని ఇంజినీరింగ్‌ విభాగంపై దృష్టిసారించి అనుభవం, అర్హత కలిగిన ఇంజినీర్లను నియమించి, మాస్టర్‌ప్లాన్‌ పనులు పూర్తి నాణ్యతతో నిర్మించేలా పర్యవేక్షణ చేసేందుకు అవరమైన పూర్తిస్థాయి ఇంజినీర్లను నియమిస్తారో లేక టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడి సూచించిన ఆర్‌అండ్‌బీ శాఖ ఈఈని డెప్యూటేషన్‌పై నియమిస్తారో చూడాలి.

శ్రీశైల దేవస్థానంలో

అభివృద్ధి పనులకు ఇంజినీర్లు కరువు

దేవస్థానంలోని ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌

ఇంజినీర్లు రిటైర్డ్‌

శ్రీగిరిలో త్వరలో మూడు విడతల్లో

రూ.800 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ పనులు

రూ.800 కోట్ల మాస్టర్‌ప్లాన్‌కు ఆటంకం

టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి శ్రీశైల దేవస్థానంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. దేవస్థాన ట్రస్ట్‌బోర్డు సుమారు రూ.800 కోట్లతో మూడు విడతల్లో మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా క్యూకాంప్లెక్స్‌, పబ్లిక్‌ ఎనిమిటీస్‌, టాయిలెట్స్‌, సాలు మండపాలు నిర్మించాలని భావిస్తున్నారు. అయితే దేవస్థానంలో ఈఈలు లేకపోవడంతో మాస్టర్‌ప్లాన్‌ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మాస్టర్‌ప్లాన్‌ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ, నాణ్యతతో నిర్మాణ పనులు, పర్యవేక్షణ చేపట్టేందుకు దేవస్థానంలో ఈఈలు లేరు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో మాస్టర్‌ప్లాన్‌ అమలుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement