నిబంధనలకు విరుద్ధంగా శ్రీమఠంలో ప్రైవేటు దుకాణం
అనుమతుల వెనుక ఎవరన్నది అంతు చిక్కని వైనం
పూజా సామగ్రి అధిక ధరలకు విక్రయం
కొన్నేళ్లుగా దోపిడీకి గురవుతున్న భక్తులు
నోరు విప్పని శ్రీమఠం అధికారులు
మంత్రాలయం: శ్రీమఠం బ్రాండ్‌తో భక్తులను మోసగిస్తున్నా అడిగే వారు లేరు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా చర్యలు చేపట్టరు. దోపిడీపై భక్తులు మొత్తుకుంటున్నా వినేవారు కరువయ్యారు. ఎవరి ఆశీస్సులు ఉన్నాయో తెలియదు.. అనుమతులు ఎవరిచ్చారో బయటకు చెప్పరు.. దేవాదాయశాఖ నిబంధనలకు విరుద్ధంగా శ్రీమఠంలోపల ఓ వ్యాపారి కొన్నేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నాడు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయ ప్రాంగణాల్లో ఎటువంటి వ్యాపార దుకాణాలు ఉండరాదు. బయట వ్యక్తుల ఆధీనంలో ఎలాంటి వ్యాపారాలు చేపట్టరాదు. ఒకవేళ ఉంటే ఆలయ ఆధీనంలో రసీదులతో కూడిన లావాదేవీలు చేపట్టాలి. అంతేగాక దేవాదాయ శాఖ నియమం ప్రకారం అందులో అర్చన కుంకుమ, పరిమళ విభూతి, నియమ నిబంధన పూజా పదార్థాలు మాత్రమే విక్రయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులు ఆలయ ప్రాంగణాల్లో వ్యాపారాలకు తావు ఉండదు. మఠంలో ఓ ప్రైవేటు వ్యక్తి దోపిడీకి అనుమతి ఎవరిచ్చారో అంతు చిక్కడం లేదు. ప్రాంగణంలోని గ్రామ దేవత మంచాలమ్మ గర్భాలయానికి వెనుక భాగంలో రాఘవేంద్రుల గర్భమఠానికి ఈశాన్య దిక్కున పెద్ద దుకాణం కేటాయించి ‘న్యూ శ్రీ రాఘవేంద్రస్వామి పూజా బండార్’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కర్ణాటకలోని ఉడిపీ ప్రాంతానికి చెందిన పరమేష్ అనే వ్యక్తి 15 ఏళ్ల క్రితం శ్రీమఠం ప్రధాన ముఖద్వారం కుడివైపు చిన్న క్యాసెట్ల అంగడి పెట్టుకున్నాడు. భక్తి గేయాల క్యాసెట్లు, సీడీలు, డీవీడీలు అమ్ముకుంటూ కాలం వెల్లదీశాడు. ఇప్పటికీ ఆయనను స్థానికులు క్యాసెట్ల పరమేష్ అని ముద్దుగా పిలుచుకుంటారు. కొన్నేళ్ల తర్వాత శ్రీమఠంలోనే దుకాణం తెరిచాడు. చేతి దారాలు మొదలు తపంబు పీఠాల వరకు వ్యాపారం నడుస్తోంది. అక్కడ ఏ వస్తువు కొన్నా బయట దుకాణాల్లో ధరల కంటే ఐదోవంతు ఎక్కువ. ఉదాహరణకు రాగి చెంబు బయట దుకాణంలో రూ.200కు లభిస్తే అదే చెంబు ఇక్కడ మాత్రం రూ.1000కి అంటగడతారు. ఇలా ప్రతి వస్తువుపై అంతే. ఎవరైనా భక్తులు ప్రశ్నిస్తే ఇదీ శ్రీమఠం బ్రాండ్ అంటూ బురిడీ కొట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. శ్రీమఠంలో ప్రైవేటు పూజా బండార్ లేనప్పుడు క్షేత్రంలో 20 దాకా పూజా సామగ్రి దుకాణాలు ఉండేవి. కొందరు బండ్లపైనే పెట్టుకుని జీవనం సాగించే వారు. అయితే మఠంలో బండార్ పెట్టడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడి వ్యాపారాలు వదులుకున్నారు. భక్తులను దోచుకుంటున్న వ్యాపారిపై శ్రీమఠం అధికారులకు ఎందుకంత ప్రేమో తెలియడం లేదు. అది దేహ రహస్యంగానే మిగిలింది.


