వెల్దుర్తి: ‘మీ ప్రభుత్వంలో ఇచ్చిన స్కూల్ బ్యాగ్‌లు ఎంతటి నాణ్యతగా ఉన్నాయో చూడండి. రెండు నెలలకే మొత్తం చినిగిపోయి తిరిగి కుట్టించుకునేందుకు కూడా వీలులేకుండా పోయాయి. ఇదేనా మీ పథకాల నాణ్యత’ అంటూ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆమె వెల్దుర్తి మండలంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పాతబస్టాండులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి నాణ్యతలేని పథకాలు అమలు చేస్తోందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుందన్నారు. ఇదే సందర్భంలో సమావేశం జరుగుతున్న ప్రాంతంలో తిరుగాడుతున్న కృష్ణగిరి మండలం ఎరుకులచెరువుకు చెందిన 6వ తరగతి విద్యార్థిని కె.రాణి, ఆమె తల్లి స్కూల్ బ్యాగుల ప్రస్తావన విని సమావేశం వద్దకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రసంగం అనంతరం విద్యార్థిని తన స్కూల్ బ్యాగ్ రెన్నెల్లకే చినిగిపోయిందని మాజీ ఎమ్మెల్యేకు చూపుతూ, కొత్తది కొనివ్వమని నాన్నను అడిగితే తిడుతున్నాడని.. అమ్మ కొనిస్తా, లేకపోతే కుట్టిస్తా పద అంటూ వెల్దుర్తికి తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఇచ్చిన జగనన్న విద్యా కానుక బ్యాగులు ఇప్పటికీ నాణ్యతతో చెక్కుచెదరలేదన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఇచ్చిన బ్యాగులు నాణ్యత ఎలా ఉన్నాయో ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, చివరికి టీడీపీ నాయకులకే తెలుసన్నారు. మరి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ఈ విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.


