గతంలో డి. కొట్టాల గ్రామంలో శ్మశానం లేక పోవడంతో ఎవరు మృతి చెందినా రోడ్ల వెంట దహన సంస్కారాలు చేసుకునేవారు. గ్రామం ఏర్పడినప్పటి నుంచి శ్మశానం లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులందరూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన గ్రామస్తులు, రెవెన్యూ అధికారులతో చర్చించి గ్రామానికి చెందిన శరభారెడ్డిని ఒప్పించి 126 సర్వే నంబర్‌లో 12 సెంట్లస్థలం శ్మశానికి రిజిస్టర్ చేయించారు. అంతేకాకుండా శ్మశానానికి చేరుకునేందుకు వీలుగా డి.కొట్టాల, శ్రీరంగాపురం ప్రధాన రహదారి నుంచి ఉపాధి హామీ పథకం కింద రహదారిని కూడా ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ప్రభుత్వం మారిన వెంటనే టీడీపీ నేతలు శ్మశానానికి వెళ్లే రహదారిని ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ స్థలాన్ని ట్రాక్టర్లతో దున్నించి, చదును చేసి ఏకంగా వ్యవసాయ పొలంలో కలుపుకుని వరినాట్లు వేయడంతో మూడు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో శ్మశాన సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. రోడ్డు పక్కనే శవాలకు అంత్యక్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


