కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో సెప్టెంబరు నెల 976 పింఛన్లపై వేటు పడింది. పింఛన్‌దారులు మరణించారనే కారణంలో తొలగించినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీకి కర్నూలు జిల్లాకు రూ.102.48 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.90.87 కోట్లు బ్యాంకులకు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఆగస్టు నెలలో 2,33,918 పింఛన్లు ఉండగా సెప్టెంబరు నెలలో 2,33,431 ఉన్నాయి. అంటే 487 పింఛన్లపై కోత పడింది. నంద్యాల జిల్లాలో అగస్టు నెలలో 2,10,221 పింఛన్లు ఉండగా సెప్టెంబరు నెలలో 2,09,732 ఉన్నాయి. అంటే 489 పింఛన్లపై వేటు పడింది. ఈ నెల 31న బ్యాంకులకు పింఛన్లకు సంబంధించిన నిధులు విడుదల అవుతాయి. అదే రోజున గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు డ్రాచేసి సెప్టెంబరు 1న పంపిణీ చేస్తారు.
నమో.. లక్ష్మీనారసింహా
ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన అహోబిల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారమైన శనివారం కావడంతో పాటు శ్రావణమాసం ముగింపుకొచ్చిన సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావణ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులుదీరారు. దిగువ అహోబిలంలో ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
శ్రీశైలంకు స్వల్పంగా వరద
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి శనివారం సాయంత్రం నుంచి స్వల్పంగా వరద ప్రవాహం మొదలయ్యింది. జూరాల ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పాదన చేస్తుండడంతో 9,722 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, హంద్రీనీవా సుజలస్రవంతికి 44,910 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 15.488 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. శనివారం సాయంత్రం సమయానికి జలాశయంలో 152.1568 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 872.50 అడుగులకు చేరుకుంది.
ప్రత్యామ్నాయ సాగుకు సబ్సిడీ విత్తనాలు
కర్నూలు(అగ్రికల్చర్): కరువు నేపథ్యంలో 11,995 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయతలపెట్టింది. కొర్రలు, జొన్న, సజ్జ, ఆముదం, కంది, మినుము, ఉలువలు, పెసలు 1119 క్వింటాళ్లు కేటాయించింది. కొర్రలు కిలో పూర్తి ధర రూ.60 ఉండగా సబ్సిడీ పోను రైతులు రూ.12 చెల్లించాల్సి ఉంది. కందులు ఎల్‌ఆర్‌జీ–52, పీఆర్‌జీ 176, ఐసీపీఎల్ 8749 రకాల కిలో పూర్తి ధర రూ.120.50 ఉండగా రూ.24.10 చెల్లించాల్సి ఉంది.
ఆంజనేయ స్వామికి 3.5 కేజీల
వెండి గద సమర్పణ
ఆదోని రూరల్: జాలిమంచి గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధాపురం ఆంజనేయస్వామి ఆలయానికి 3.5 కేజీల వెండితో తయారు చేయించిన గదను మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి సమర్పించారు. ఆలయంలో శనివారం పూజా కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కప్పట్రాళ్ల శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సచివాలయాల్లో ప్రతి రోజూ పీజీఆర్‌ఎస్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పీజీఆర్‌ఎస్ నిర్వహించాలని జిల్లా అధికారి టీవీ భాస్కర్‌నాయుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా పరిషత్‌లోని తన కార్యాలయంలో మండల/అర్బన్ సచివాలయాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో విధులు ముగించుకొని తప్పనిసరిగా పీజీఆర్‌ఎస్‌కు హాజరు కావాలన్నారు.


