కర్నూలు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు జిల్లాలో న్యాయవిజ్ఞాన క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్, ఏపీఎస్పీ రెండో బెటాలియన్ క్యాంప్, వీఆర్ కాలనీలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్‌లో శనివారం న్యాయ విజ్ఞాన క్లబ్‌లను ఏర్పాటు చేశారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఈ క్లబ్‌లను ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రాథమిక న్యాయ హక్కులు, న్యాయ సేవలపై అవగాహన కల్పిస్తూ ఉచిత న్యాయ సహాయం కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 15100 ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు.
ముగిసిన శిక్షణా కార్యక్రమం...
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మధ్యవర్తులకు 40 గంటల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఈ సందర్భంగా మధ్యవర్తులకు ధృవపత్రాలను అందజేశారు. శిక్షణ పొందిన మధ్యవర్తులు అవసరమైన వారికి నాణ్యమైన న్యాయ సేవలందించేలా కృషి చేయాలని కబర్ధి సూచించారు.
న్యాయాధికారులతో వర్చువల్
సమావేశం...
సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులను పెద్ద సంఖ్యలో పరిష్కరించాలని లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లాలోని కర్నూలు మినహా ఇతర న్యాయస్థానాల న్యాయాధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు.


