శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరు గుతున్న కారణంగా సామాన్య భక్తుల సౌకర్యార్థం శని, ఆది, సోమవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శన విధానంలో మార్పులు చేసినట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతు గుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు. శనివారం ‘సాక్షి’లో ‘అంతా మా ఇష్టం’ శీర్షికన ముందస్తు సమాచారం లేకుండా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో భక్తుల ఇబ్బందులపై కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన చైర్మన్, ఈఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. శని, ఆది, సోమవారాల్లో ఉదయం వేళల్లో మనమిత్ర వాట్సప్, ఆన్‌లైన్ ద్వారా స్పర్శదర్శనం టికెట్లను ముందస్తుగా పొందిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు. అలాగే ప్రముఖులు స్వయంగా వచ్చేనప్పుడు మాత్రమే ఉదయం వేళల్లో ప్రాధాన్యతను బట్టి స్పర్శదర్శనం కల్పిస్తామన్నారు. ప్రముఖులు అందజేసే సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు అవకాశాన్ని బట్టి రాత్రి వేళల్లో మాత్రమే స్పర్శదర్శనానికి వీలు కల్పిస్తామన్నారు.


