● రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్
దర్శనాలు రద్దు
మల్లన్న దర్శనానికి బారులు తీరిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మల్లన్న ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది. భక్తులకు క్యూకంపార్ట్‌మెంట్లలో పాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి. కాగా వారాంతపు సెలవు రోజులు కావడంతో శ్రీశైలంలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ కారణంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్, సిఫార్స్‌ల లేఖలతో వచ్చే వారికి మల్లన్న స్పర్శదర్శనం రద్దు చేసి, మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని దేవస్థాన అధికారులు ప్రకటన విడుదల చేశారు.


