● సాగుతున్న మోడల్ పాఠశాల గదుల నిర్మాణం
● అద్దె గదుల్లో విద్యాబోధన ● విద్యార్థులకు తప్పని తిప్పలు
నంద్యాల(అర్బన్): దేవుడు వరం ఇచ్చినా.. పూజారి కరుణించడు.. అన్న చందంగా మారింది నంద్యాల మండలం మిట్నాల గ్రామంలో మోడల్ స్కూల్ నిర్మాణ పనులు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల చేతివాటంతో ఆరేళ్లు గడుస్తున్నా పాఠశాల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. బిల్లుల పెండింగ్ కారణంగా కాంట్రాక్టర్లు పనులు చేయలేకపోవడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందించి నిధులు మంజూరు చేసినా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఇబ్బందుల మధ్య చదువుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మిట్నాల గ్రామంలో మోడల్ స్కూల్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. 2021లో దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో పాఠశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కాంట్రాక్టర్ల చేతి వాటాలతో నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో మోడల్ స్కూల్ విద్యార్థులు అద్దె భవనాల్లో ఇబ్బందుల చదువులు చదవాల్సి వస్తోంది. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రత్యేక నిధులు కేటాయింపుతోనైనా పాఠశాల గదులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా గదుల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో ఏళ్ల తరబడి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రస్తుతం పాఠశాలకు సొంత భవనాలు లేకపోవడంతో నంద్యాల పట్టణ సమీపంలోని పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించిన పాత భవనాల్లో విద్యార్థులకు విద్యను అందించడం ప్రారంభిచారు. భవనం కూలిపోయే దశకు చేరుకోవడంతో బండిఆత్మకూరు మండలం పార్నపల్లె వద్ద ఉన్న ప్రభాత్ జూనియర్ కళాశాలకు విద్యార్థులను తరలించి తరగతులను నిర్వహించారు. దూరభారం కావడంతో అధికారులు స్థానికంగా ఉన్న ఎస్పీవైరెడ్డి జూనియర్ కళాశాల గదులకు అద్దెలు చెల్లిస్తూ బోధన సాగిస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే మూడు ప్రాంతాలకు విద్యార్థులను మార్చి ఇబ్బందులకు గురి చేశారు. 2026– 27 విద్యాసంవత్సరానికి అయినా మోడల్‌పాఠశాల గదులు పూర్తవుతాయని భావించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది.


