ఒక్కో కళాశాల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు ముడుపులు అమాత్యునికి అప్పగించే బాధ్యత డబ్బులు వసూలు చేసి మంత్రికి అప్పగించేందుకు నిర్ణయం యూనివర్సిటీల వారీగా సమావేశాల నిర్వహణ
కర్నూలు కల్చరల్: టీడీపీ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) బీఈడీ కళాశాలల యాజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్కో కళాశాల నుంచి ఇంటేక్ సీట్ల ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.2లక్షల చొప్పున వసూలుకు రంగం సిద్ధమైంది. ఓ మంత్రి వద్ద అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న వ్యక్తి ఈ వసూళ్ల దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఓ కమిటీ రంగంలోకి దిగిందని, వసూలు చేసిన మొత్తాన్ని సదరు మంత్రికి అప్పగించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. బీఈడీ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర నాయకులు ముగ్గురు యూనివర్సిటీ ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి డబ్బు వసూ లు బాధ్యతను ప్రతి జిల్లాలో ఒకరికి కట్టబెడుతుండటం గమనార్హం. గత నెల నుంచి రహస్య సమావేశాలు నిర్వహిస్తుండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో గత వారంలో సమావేశం పూర్తయింది.
రిజిస్ట్రేషన్‌కు ఆదేశాలు
ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుకు గత నెల 29 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు.. ఈనెల 6 నుంచి డిగ్రీ, 13 నుంచి ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, 20 నుంచి బీఈడీ కళాశాలలు, 27 నుంచి లా, బీపీఈడీ కళాశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏ ఒక్క విశ్వవిద్యాలయంలో కూడా కళాశాలల యాజమాన్యాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం గమనార్హం. ఎఫ్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ప్రతి కళాశాల ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలి. అయితే ఆ ఊసే కరువైంది.
కార్పస్ ఫండ్ పేరిట వసూళ్లు
కళాశాలల్లో ఉద్యోగులు, సిబ్బందితో పాటు విద్యా ర్థుల ముఖ ఆధారిత హాజరు నమోదు తప్పనిసరి చేయడంపై కూటమి అనుకూల కళాశాలల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు రహస్య సమావేశాలు నిర్వహిస్తూ వసూళ్లకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కళాశాలల నుంచి కార్పస్ ఫండ్ పేరిట వసూళ్లు చేసి ముట్టజెప్పేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే 50 శాతం సీట్లు భర్తీ?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీలు ఉన్నా.. ఆర్‌యూ పరిధిలో మాత్రమే బీఎడ్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 50 కళాశాలల్లో గత విద్యా సంవత్సరంలో 4,773 అడ్మిషన్లు చేపట్టారు. ఇంకా యూనివర్సిటీలు అఫిలియేషన్ ప్రక్రియను పూర్తి చేయలేదు. కొన్ని కళాశాలలు అనుమతులకు సంబంధించి న్యాయస్థానాలను ఆశ్రయించి వెసులుబాటు తీసుకున్నారు. అయితే వాస్తవ వివరాలతో కోర్టుల్లో కౌంటర్ వేయడానికి వర్సిటీలు ముందుకు రాకపోవడం కుమ్మక్కు వ్యవహారానికి బలం చేకూరుస్తోంది. బీఈడీ కళాశాలల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అయితే ఇప్పటికే 50 శాతానికి పైగా సీట్లను భర్తీ చేసుకోవడం.. ఈ విషయాన్ని ప్రభుత్వం, వర్సిటీలు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ముడుపులు దండుకోవడమే ఎజెండా
ఎఫ్‌ఆర్‌ఎస్ వద్దంటున్న బీఎడ్ కళాశాలలు
కూటమి ప్రభుత్వం కొత్త విధానాల పేరుతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నుంచి భారీగా ముడుపులు దండుకోవడమే ప్రధాన ఎజెండాగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బీఈడీ కళాశాలల్లో అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం.. పారదర్శకత పేరిట ఎఫ్‌ఆర్‌ఎస్‌ను తెరపైకి తీసుకొస్తోంది. దీనిని ఎలాగైనా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తాయని తెలిసి.. వారిని దారికి తెచ్చుకోవడం ద్వారా భారీగా దండుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి నాయకులు కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ఎఫ్‌ఆర్‌ఎస్ నిలుపుదలకు కోర్టుల్లో సైతం కేసులు వేయించడం గమనార్హం.


