శ్రీశైలంటెంపుల్: శ్రీగిరి క్షేత్రంలో కూటమి నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా తమ అనుచరులతో అనధికారికంగా వ్యాపారం చేయిస్తున్నారు. శ్రీశైలంలో క్లాక్‌రూం వద్ద పంచెలు అమ్ము తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే ఉచిత కంపార్ట్‌మెంట్లలో టీ, కాఫీ వ్యాపారం చేయిస్తున్నారు. దుకాణాల సముదాయంలో తనకు అనుకూలమైన వారు ఏవిధమైన వ్యాపారం చేసినా అడ్డుచెప్పకుండా అధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ ఇప్పించారు.
కాంట్రాక్టర్లపై భౌతికదాడులు చేసి..
శ్రీశైలంలో సెల్‌ఫోన్లు, లగేజీ బ్యాగులు భద్రపర్చుకునే టెండర్‌లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై భౌతికదాడులు చేశారు. ఎవరినీ టెండర్‌లో పాల్గొనకుండా చేసి కూటమి నేతలు తమ అనుంగ అనుచరులకు ఇప్పించుకున్నారు. క్లాక్‌రూం ఆదాయంతో పాటు ఇతర వ్యాపారం చేస్తే మరింత డబ్బు వస్తుందని భావించి అక్కడ పంచెలు, కండువాలు విక్రయిస్తున్నారు. క్లాక్‌రూం వద్ద ఎటువంటి ఇతర వ్యాపారం చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే దేవస్థాన ఈఓతో అనుమతి తీసుకోవాలి. టెండర్ ద్వారా ఆ దుకాణాన్ని దక్కించు కోవాలి. ఇవేమీ లేకుండానే పంచెలు, కండువాలు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉచిత కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు కూటమి నాయకుల అనుచరులు టీ, కాఫీ విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. దేవస్థానం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే విక్రయాలు జరుపుతున్నారు.
బేరం కుదరడంతో..
తనపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని, తనకు ఆత్మహత్యే శరణ్యం అని ఓ వ్యాపారి గతంలో వీడియో రిలీజ్ చేశారు. అయితే కొన్నిరోజులకు కూటమి నాయకులతో బేరం కుదరడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా సదరు వ్యాపారి దుకాణాలు ఉచిత దర్శనానికి వెళ్లే దారికి ఎదురుగా ఉండడంతో వ్యాపారం బాగా జరుగుతోంది. కూటమి పెద్దల ఆశీస్సులతో దుకాణాల వద్ద మరో దుకాణాల మారిదిగా మెట్లు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేశారనే కోపంతో మరో మహిళా దుకాణం వద్ద దుకాణం కనపడకుండా సమాచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయిన వారికి అకుల్లో..కానీ వారికి కంచాల్లో అన్న చందంగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు.
ఆర్జిత సేవల క్యూలైన్ క్లాక్‌రూం
వద్ద పంచెల విక్రయాలు
ఉచిత కంపార్ట్‌మెంట్లలో టీ, కాఫీ
బిజినెస్
మల్లన్న ఆదాయానికి భారీగా గండి
చోద్యం చూస్తున్న దేవస్థాన అధికారులు


