మహానంది: మహానంది క్షేత్రం శనివారం భక్తులతో కళకళలాడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కోనేర్లలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఉచిత, శీఘ్ర, మహదాశీర్వాచనం, అభిషేకం ,అర్జిత సేవా టికెట్ల ద్వారా భక్తులు శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం భక్తులకు ఉచిత ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఆది, సోమవారాల్లో నిరంతర దర్శన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాస రెడ్డి తెలిపారు.
శ్రీశైల దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. శనివారం ఉదయం శ్రీశైల దేవస్థాన వెబ్‌సైట్‌లో టికెట్ల బుకింగ్‌కు అంతరాయం ఏర్పడింది. శ్రీశైల మల్లన్న ఆర్జిత సేవా టిక్కెట్లు, స్పర్శ దర్శనం టిక్కెట్లు బుకింగ్ చేసినా డౌన్ లోడ్ కాకపోవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. బుకింగ్ హిస్టరీలో వివరాలు చూపించకపోవడం గందరగోళానికి తావిచ్చింది. వారాంతపు రోజు కావడంతో ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌కు భక్తులు అవస్థలు పడ్డారు. ఈ సమస్య మూడు గంటల పాటు ఇబ్బందులు పెట్టినట్టు భక్తులు పేర్కొన్నారు. ఈ విషయమై దేవస్థానం అధికారులను వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయ శాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలిపారు.
అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): జిల్లా పరిధిలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టులలోని మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ లీలావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 7 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 101 అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తకు అభ్యర్థినులు తప్పని సరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, 2025 జూలై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 35 ఏళ్ల వయస్సు లోపు వారై ఉండాలని, తప్పని సరిగా వివాహితురాలై స్థానిక నివాసం ఉండాలన్నారు. ఆయా పోస్టుకు అభ్యర్థి పదవ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఒక వేళ పదవ తరగతి వారు ఎవరూ లేకపోతే ఎక్కువ చదువు చదివిన వారు అర్హులుగా ఉంటారన్నారు. ధ్రువీకరణ పత్రాలతో స్థానిక సీడీపీఓ కార్యాలయంలో ఈనెల 14 నుంచి 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు.
సూర్యుడి ప్ర‘తాపం’
● గోస్పాడులో 42.8, మంత్రాలయంలో
42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
కర్నూలు (అగ్రికల్చర్): సూర్యుడి ప్రతాపానికి కర్నూలు, నంద్యాల జిల్లాలు నిప్పుల కొలిమిని తలపించాయి.పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శనివారం గోస్పాడులో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంత్రాలయంలో 42.7, ఆళ్లగడ్డలో 42.6, దొర్నిపాడులో 42.3, కౌతాళంలో 42.2, నంద్యాల రూరల్‌లో 42.1, చాగలమర్రిలో 42 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ మధ్యాహ్నం సమయంలో సాధారణంగా 30 శాతం ఉండాలి. అయితే 10 శాతానికి పడిపోవడంతో వేడిగాలుల తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది.
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆలయ దక్షిణ మాడ వీధులలోని నిత్య కళావేదికపై హైదరాబాద్‌కు చెందిన గురు నృత్యాలయ కూచిపూడి డాన్స్ అకాడమీ వారి సంప్రదాయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గణపతి ప్రార్థన, శివపంచాక్షరి స్తోత్రం, చిదంబరస్తోత్రం, జతిస్వరం, నమశ్శివాయతే తదితర గీతాలకు హిమశ్రీ, హిమవర్షిణి, సహస్ర, ధాత్రి, మయూఖ, శ్రీశ్రేష్ఠ, వైష్ణవి, అభిజ్ఞ తదితరులు నృత్యప్రదర్శన చేశారు.


