ప్రైవేటు సైన్యంతో మంత్రి బీసీ వసూళ్ల దందా | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు సైన్యంతో మంత్రి బీసీ వసూళ్ల దందా

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

బనగానపల్లె: ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వసూళ్ల దందా నడుపుతున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. పట్టణంలో ఆయన స్వగృహం వద్ద శనివారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి క్యాడర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి బీసీ రోడ్లు నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత లోపం ఉన్నాయంటూ కాంట్రాక్టర్లను తన వద్దకు రప్పించుకుని కమీషన్ల వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమా ధానం చెప్పాలన్నారు. మంత్రి బీసీ బనగానపల్లెలో చుట్టూ ప్రైవేట్‌ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇసుక టిప్పర్‌ నుంచి రూ. 300, గ్రావెల్‌ టిప్పర్‌ నుంచి రూ.1,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బెల్టుషాపులు, రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుందన్నారు.

వ్యాపారులను భయపెట్టి రూ.కోట్లు వసూలు

కేసీవీఆర్‌ ప్రాజెక్టు యజమాని జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై మంత్రి బీసీ అక్రమ కేసులు పెట్టించి, ఆయన ద్వారా రూ.30 కోట్లు అక్రమంగా వసూళ్లు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. పట్టణంలోని వ్యాపారి నూకల విజయుడు ఇంటికి మూడు రోజుల పాటు విద్యుత్‌ ను తొలగింపజేసి ఆయనతో పాటు సోదరుడు నూకల సుబ్బయ్య, వారి బావ ద్వారా రూ.3 కోట్లు, బనగానపల్లె పట్టణంలో ఫంక్షన్‌హాల్‌ యజమాని వేణుగోపాల్‌ వద్ద నుంచి రూ.1.5 కోట్లు, డాక్టర్‌ మహమ్మద్‌హుస్సేన్‌, శ్రీనివాసరెడ్డిని బెదిరించి అక్రమంగా వసూలు చేశారన్నారు. పొగాకు కొనుగోలుదారుల నుంచి మంత్రి అనుచరులు బేలుకు రూ.2 వేలు వసూలు చేయడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎస్సార్‌బీసీకి చెందిన మిగులు స్థలాల్లో ఇంటి స్థలాల పంపిణీ చేయబోగా కోర్టు స్టే ద్వారా అడ్డుకున్న బీసీ ఇప్పుడు అదే స్థలంలో స్థలాల పంపిణీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. 2024 ఎన్నికల ప్రచారంలో బనగానపల్లె పట్టణంలో ప్రచారంలో భూమిని కొనుగోలు చేసి ఇంటి స్థలాలను పంపిణీ చేస్తామన్న మంత్రి బీసీ ఇప్పుడు ఎస్సార్‌బీసీ స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయ మాన్యం భూమికి మంత్రి ఎసరు పెట్టారని విమర్శించారు.

పంటలను ఎలా కాపాడుకోవాలి

జిల్లాలో ఎస్సార్‌బీసీకి నీటి విడుదల నిలిచిపోవడంతో రైతులు పంటలను కాపాడుకోలేక పోతున్నారని జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద వచ్చిన సమయంలోనే గోరుకల్లు, అవుకు రిజర్వాయర్‌ పూర్తి స్థాయిలో నింపి ఉంటే ప్రస్తుతం నీటి సమస్య ఏర్పడేది కాదన్నారు. ఇటీవల నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో జిల్లాలో తాగునీటి సమస్య ఉత్పన్నం అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పగా, ఆ సమావేశంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నీటి సమస్య ఉండదని చెప్పారని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. గతేడాది అవుకు రిజర్వాయర్‌ లీకేజీ ఏర్పడితే చర్యలు తీసుకోకపోవడంతో సమస్య తీవ్రమవుతుందని జెడ్పీ చైర్మన్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement