తెలుగు తమ్ముడి జల దోపిడీ | - | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముడి జల దోపిడీ

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

ఉచిత మినరల్‌వాటర్‌ ప్లాంట్‌ నీటిని అమ్ముకుంటున్న టీడీపీ నేత

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ వసూళ్లకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు తెలుగు తమ్ముళ్లు దోపిడీకి శ్రీకారం చుట్టారు. కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నెకు చెందిన ఓ టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉచిత మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ నీటిని అమ్ముకుంటూ జలదోపిడికి పాల్పడుతున్నాడు. గ్రామంతోపాటు కోవెలకుంట్ల పరిసర ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆర్టీసీ బస్టాప్‌ సమీపంలో ఉచిత మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. విద్యుత్‌ బిల్లు, వాటర్‌మెన్‌కు వేతనం, తదితర నిర్వహణ ఖర్చులకు సంబంధించి ఏడాదికి రూ.1.50 లక్షలకు పైగా గ్రామ కమిటీ (రైతు సంఘం) భరిస్తూ ఈ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి భర్త, టీడీపీ నేత గత 20 నెలల నుంచి ఉచిత మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నీటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న విషయం ఇటీవల బయటపడింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం ప్లాంట్‌ నుంచి ప్రతి రోజు క్యాన్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సదరు టీడీపీ నేత నెలకు రూ. 1,500 చొప్పున పాఠశాల యాజమాన్యం నుంచి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరవై నెలల నుంచి ప్రతి నెలా ఫోన్‌పే ద్వారా డబ్బులు ఆయన ఖాతాకు జమ అయినట్లు ఫోన్‌పే లావాదేవీలు లీక్‌ కావడంతో టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక స్కూల్‌ యాజమాన్యం నుంచే డబ్బులు వసూలు చేస్తు న్నాడా.. ఇతర వ్యక్తుల వద్ద నుంచి కూడా నీటిని పట్టుకున్నందుకు డబ్బులు తీసుకుంటున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు ప్లాంట్‌ ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయగా టీడీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నేత జలదోపిడీకి తెరలేపి నీటిని అమ్ముకున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉచిత ప్లాంట్‌ నీటిని అమ్ముకుంటున్న టీడీపీ నేత తీరును పలువురు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement