డోన్: ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. అధికార దుర్వినియోగంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న ఉదంతాలు డోన్ నియోజకవర్గంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు నెలల్లో ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఒక సబ్‌ట్రెజరీ అధికారి లంచాలు తీసుకుంటూ ఏసీబీ అఽధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డోన్ ఎంపీడీఓ, కమిషనర్ ప్రభుత్వ సొమ్మును కాజేసిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల డోన్ మండలం కొత్తబురుజు గ్రామ పర్యటనకు సీఎం చంద్రబాబు వచ్చిన సందర్భంగా మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరెడ్డి కారు అద్దెకు తీసుకోకుండా ఇతరుల కారులో పర్యటించారని ఉన్నతాధికారులు అభియోగం మోపారు. కాసులకు కక్కుర్తి పడి ప్రతి నెల వేలాది రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం నుంచి వాహనాల అద్దె రూపంలో కొల్లగొడుతున్నందున ఎంపీడీఓకు చెల్లించాల్సిన వాహనాల అద్దెను నిలిపివేయాలని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓతో పాటు డోన్ ట్రెజరీ అఽధికారికి సిఫారసు చేశారు. అయితే ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో డోన్ ఎంపీడీఓ కంటే మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌గౌడ్ రెండాకులు ఎక్కువే చదివారని చెప్పవచ్చు. ప్రతి నెల తాను పర్యటనలు జరిపేందుకు రూ.35 వేలు తీసుకుంటూ డ్రైవర్ జీతం మిగిల్చుకునేందుకు కక్కుర్తి పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. తాను పర్యటనలు జరిపే కారుకు ఎల్లో బోర్డు పెట్టుకోకుండా, డ్రైవర్‌ను నియమించుకోకుండా ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగి అయిన రూ.50వేల వేతనం తీసుకుంటున్న ఇమామ్ అనే ఉద్యోగిని మున్సిపల్ కమిషనర్ కారు డ్రైవర్‌గా వాడుకుంటున్నారు. అయితే డ్రైవర్ జీతంతో పాటు కారు అద్దె కింద ప్రతి నెల రూ.35 వేలను ఆయన మున్సిపల్ సాధారణ నిధుల నుంచి తన ఖాతాలోకి వేసుకుంటున్నారు.
సీఎం సభకు రూ.6 లక్షలు ఖర్చు..
గత వారం డోన్ మండలం కొత్తబురుజు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు సభకు డోన్ మున్సిపల్ సాధారణ నిధుల నుండి రూ.6 లక్షలు ఖర్చు చేసినట్లు కమిషనర్ ప్రసాద్‌గౌడ్ నిధులను కొల్లగొట్టేందుకు సర్వసభ్య అజెండాలో చేర్చినట్లు తెలిసింది. ఈ విషయంపై శుక్రవారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు నిలదీయగా, ‘మీలో ఒక్కరైనా ఒక్కపూట తమ వర్కర్లకు భోజనం పెట్టారా’ అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం సభకు జిల్లా కలెక్టర్ భోజన వసతులు ఏర్పాటు చేస్తే నిబంధనలకు విరుద్ధంగా రూ.6 లక్షలు సభ అనుమతి లేకుండా ఎప్పుడు ఎలా ఖర్చు చేశారని నిలదీశారు. దీంతో కంగుతిన్న కమిషనర్ ‘మీకు ఇష్టమైతే ఆమోదించండం, లేకపోతే లేదు’అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే, పాలకవర్గానికి మధ్య విబేధాలు సృష్టించడం, అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాయడం తప్ప ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాల్సిన ధ్యాస కమిషనర్‌కు లేదు. అతని అక్రమాలు, అవినీతిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కఠిన చర్యలు చేపట్టాలి. – మల్లికార్జునరెడ్డి, కౌన్సిలర్
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ డ్రైవర్‌తో
కమిషనర్ బిల్లులు స్వాహా
అద్దె వాహనం లేకుండానే
ప్రజా సొమ్ము కొల్లగొట్టిన ఎంపీడీఓ
అధికారుల కక్కుర్తిపై ప్రజలు విమర్శలు
నిధులు రికవరీ చేయాలని
మున్సిపల్ కౌన్సిలర్ల డిమాండ్


